English | Telugu
గవర్నర్ సాబ్... నా పదవిని కాపాడండి: ఏ పీ పీ ఎస్ సి చైర్మన్
Updated : Mar 21, 2020
* కరోనా వైరస్ రాక ముందే , క్వారంటైన్ అయిన ఉదయ్ భాస్కర్
* టీ డీ పీ హయాం లో నియమితులైన ఆరుగురు సభ్యులూ కూడా , ఇపుడు చైర్మన్ ను పట్టించుకోవటం లేదు
తనపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని ఆరోపిస్తున్న ఈయన పేరు ఉదయభాస్కర్ . హోదా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. అంటే ఏ పీ పీ ఎస్ సి అనే ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ కు ఈయన పెద్ద దిక్కన్న మాట. అయితే,ఇప్పుడు ఆయనకే దిక్కు లేకుండా పోయిన పరిస్థితి. ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి లో ఆయన రాజ్ భవన్ మెట్లెక్కారు. ఒక మూడు పేజీల వినతిపత్రం కూడా సమర్పించారు. తనను నాలుగు నెలల క్రితమే, ఈ ప్రభుత్వం ' ఐసొలేట్ ' చేసిందనీ,తనకు ఆఫీసు లో ఒక గది మినహా, పీఏ, అటెండర్లు కూడా లేకుండా చేసిందనీ ఉదయ్ భాస్కర్ వాపోయారు. తాను చేయాల్సిన పనులూ సెక్రటరీతోనే చేయిస్తున్నారని,ఫైళ్లపై సభ్యులు గుడ్డిగా సంతకాలు చేస్తున్నారనీ ఉదయ్ భాస్కర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. తానుండగానే ఇన్‌చార్జ్ చైర్మన్ నియామకం జరిపితే, కోర్టుకెళ్లిన విషయాన్నీ కూడా ఉదయ్ భాస్కర్ గవర్నర్ ముందు ప్రస్తావించారు.
నిజానికి, వచ్చే సంవత్సరం నవంబర్ వరకూ ఉదయ్ భాస్కర్ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఆయనకు పనిచేసే వాతావరణం అక్కడ
లేదనీ, అయినా కూడా నాలుగు నెలలుగా భరిస్తున్నాననీ, సహిస్తున్నాననీ ఆయన గవర్నర్ కు వివరించారు. వాస్తవానికి ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ను తొలగించాలంటే, ముందుగా గవర్నర్ నోటీస్ లో పెట్టాలి, ఆ తర్వాత చైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినట్టుగా
ఒకవేళ గవర్నర్ భావిస్తేదానిపైన , తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలి. దాన్ని , రాష్ట్రపతి కార్యాలయం సుప్రీం కోర్టు నోటీస్ లో పెట్టిన తర్వాత, అప్పుడు సుప్రీమ్ కోర్టు తన నిర్ణయం వెల్లడిస్తుంది.
ఇంత ప్రొసీజర్ ఉండగా,రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ భాస్కర్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, కార్యదర్శి తోనే కథ నడిపేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఉదయ్ భాస్కర్ గవర్నర్ దృష్టి కి తీసుకెళితే, తగు విచారణ జరిపించి వాస్తవాలు కనుక్కుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి,ఈ వ్యవహారం లో మనకు బోధ పడే విషయమేమిటంటే , కరోనా వైరస్ రాక ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఏ పీ పీ ఎస్ సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను క్వారంటైన్ చేసిందనే విషయం. ఏ మాటకా మాట చెప్పాలి ధర్మ ప్రభువులు, ఏమి చేసినా చాలా పద్ధతిగా, వివరంగా,ఇంకా వైనంగా చేస్తారు.