English | Telugu

ఐఏఎస్‌లకు వాత పెడితే... సిబ్బంది లైన్‌లోకి వచ్చారు !


పొద్దు పొద్దునే హైదరాబాద్ లక్ డీ కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర ప్రతి సోమవారం కనిపించేహడావుడి ఈ సారెందుకో కనిపించలేదు. ఐదు రోజుల పని దినాల పుణ్యమా అని, చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సిబ్బంది, అధికారులు ....హైదరాబాద్ లోని తమ ఇళ్లలో రెండు రోజులు సేద దీరి, సోమవారం పొద్దుట అమరావతి బస్సెక్కి విజయవాడ కు చేరుకోవటం రివాజు గామారింది. గడిచిన ఐదేళ్ళలో ఇది వారికొక రెగ్యులర్ ప్రాక్టీస్ గా నిలిచింది. అయితే, ఐదు రోజుల పనిదినాలను దుర్వినియోగం చేస్తూ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారుల తీరుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కిందటి వారం సీరియస్ అవటం తో, ఇప్పుడు హైదరాబాద్ లో కాపురాణాలంటూ..అమరావతి లో ఉద్యోగాలు చేసుకుంటున్న సిబ్బంది, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

పని దినాల్లో కూడా సచివాలయంలో కనిపించకపోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు వేసిన అక్షింతల ప్రభావం, ఇప్పుడు సిబ్బంది, అధికారుల మీద కూడా పడింది.. ఇకపై అలా కుదరదని, వారాంతాలతో పాటు పని దినాల్లోనూ అమరావతి విడిచి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని ఐ ఏ ఎస్ లు, తమ్ దగ్గర పనిచేసే అధికారులను, సిబ్బందికి తేల్చిచెప్పేశారు.

ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలకు వెళితే చర్యలు తప్పవని సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి ఐ ఏ ఎస్ లకు చెప్పడంతో, ఆ ఆదేశాలను వారు తమ కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి కూడా పాస్ ఆన్ చేశారు. తమ అనుమతి లేకుండా , శుక్రవారం మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయి, సోమవారం మధ్యాహ్నానికి అమరావతి కి చేరుకునే స్కీములకు ఇక స్వస్తి పలకండని సిబ్బందికి ఐ ఏ ఎస్ లు ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పనిదినాలను సైతం సీరియస్ గా తీసుకోకుండా అమరావతి విడిచి వెళ్లిపోతున్న ఐఏఎస్ అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, వారు కూడా అందుకు తగ్గట్టుగా తమ పద్ధతులను మార్చుకున్నారు. . అయితే ఇందుకు ఓ కారణం జగన్ రోజూ సచివాలయనికి రాకపోవడమనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోజూ సచివాలయానికి వచ్చేవారు. దీంతో అధికారులు, సిబ్బందిలోనూ ఆ భయం ఉండేది. కానీ జగన్ మాత్రం అమరావతిపై అయిష్టతో, లేక సొంతిట్లో నుంచి రివ్యూలు చేసుకోవచ్చన్న ఆలోచనతో తెలియదు కానీ సచివాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కీలక సమావేశాలన్నీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కానిచ్చేస్తున్నారు. దీంతో ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగులకూ ఇదే అలుసుగా మారిపోయింది.

అదే సమయంలో సీఎం జగన్ రాకపోవడంతో ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగికీ ప్రభుత్వంపై ఎలాంటి భయాలు ఉండటం లేదని సచివాలయంలో పరిస్దితి చూస్తే అర్దమవుతుంది. అయితే తాజాగా పలుమార్లు మంత్రులను ప్రతీ బుధవారం కచ్చితంగా సచివాలయానికి రావాలని చెప్పిన జగన్... తాజాగా ఐఏఎస్ అధికారులకూ క్లాస్ పీకడాన్ని బట్టి చూస్తే వీరి గైర్హాజరీతో ప్రభుత్వ పాలనపై పడుతున్న ప్రభావం ఏమిటో అర్దమవుతోంది.