English | Telugu
కొసరాజు వర్సెస్ మాగంటి.. ఓ కుటుంబ రాజకీయ కథాచిత్రం!
Updated : Nov 7, 2025
మాగంటి గోపీనాథ్ కుటుంబ కథా చిత్రంలో రోజుకో కొత్త వాదన.. రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తున్నాయి. సునీత గోపీనాథ్ కి భార్యే కాదంటూ ఇటు గోపీనాథ్ తల్లి, అటు మొదటి భార్యా మాలినీ దేవి, ఆమె కొడుకు తారక్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుంటే.. బీఆర్ఎస్ లీడర్లు మరలాంటపుడు ఈ ఇద్దరు భార్యల పిల్లల్లో ఎవరి ఇంటి పేరు ఏంటో చూడాలంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.
మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన తారక్ ప్రద్యుమ్న ఇంటి పేరు కొసరాజుగా ఉంది. అదే సునీతకు పుట్టిన పిల్లల ఇంటి పేరు మాగంటిగా ఉంది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు సైతం వారి దగగర పదిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీతకు చెందిన న్యాయవాదులు. ఇదిలా ఉంటే ఇన్నాళ్ల పాటు తారక్ ను మాలినీ దేవి సొంతంగా పెంచుకున్నారనీ.. ఆమెకు కూడా గోపీ ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలిగా అంటూ ప్రశ్నిస్తున్నారు గోపి తల్లి మహానందకుమారి. దీంతో ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవరూ ఎక్కడా తగ్గట్లా. అయితే ఈ వివాదం బీఆర్ఎస్ గెలుపు ఆశలపై నీళ్లు కుమ్మరిస్తుందా అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
ఇదంతా వాటాలకు సంబంధించిన వ్యవహారమైతే ఈ సరికే కేటీఆర్ ఇరు పక్షాల వారిని పిలిపించి పంచాయితీ చేస్తే సరిపోతుంది. ఆయన ఈ విషయంలో పెద్దగా కలగ చేసుకోవడం లేదు. ఇందుకు కారణమేంటో చూస్తే.. ఒక వేళ ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే.. ఇదంతా కుటుంబ కలహంగా చెప్పుకోవచ్చు. గోపీనాథ్ అసలైన భార్యగా జనం సునీతను గుర్తించలేదు కాబట్టే తాము ఓడిపోయామని చెప్పుకునే అవకాశం ఉంటుందన్న భావనే అంటున్నారు పరిశీలకులు. అందుకే ఈ కుటుంబ కుంపటి ని చల్లార్చేందుకు కేటీఆర్ పూనుకోవడం లేదంటున్నారు.