English | Telugu
మనసంతా వైసీపీలోనే.. అందుకే రాజీనామా చేశా...
Updated : Mar 9, 2020
కొద్దిరోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్... పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన డొక్కా... అప్పట్నుంచి తెలుగుదేశంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. దాంతో, డొక్కా వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా ఎందుకు చేశారో మాత్రం చెప్పలేదు. పైగా అప్పట్నుంచీ టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో? తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో? వివరిస్తూ డొక్కా బహిరంగ లేఖ రాశారు.
తెలుగుదేశం అధిష్టానం తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు డొక్కా చెప్పుకొచ్చారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని, అది తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అలాగే, టీడీపీ నేతల చౌకబారు విమర్శలు కూడా తనను బాధించాయన్నారు. మొన్నటి ఎన్నికల్లో తాను తాడికొండ సీటు కోరానని, కానీ ఓడిపోతానని తెలిసినా, తనకు ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. ఇక, ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తనతో వ్యవహరించి తీరు... తనను మానసికంగా కలిచివేసిందన్నారు.
అయితే, ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గుచూపానని డొక్కా తన లేఖలో తెలియజేశారు. కానీ, వైసీపీ అధిష్టానంతో తాను ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. అయితే, ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్న డొక్కా... పార్టీ అనేదిక ఒక వేదిక... ఆ వేదిక ద్వారా నాదైన పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా, తన ప్రవర్తనా తీరు తెన్నులు ప్రజలకు తెలుసంటూ చెప్పుకొచ్చారు.