English | Telugu

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్...

డెంగ్యూ ఫీవర్ తెలుగు రాష్ట్రాలకు ప్రాణాంతకంగా మారింది. రెండు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరంతో వందలాది మంది మంచం పడుతున్నారు, కొన్ని చోట్ల ప్రాణాలే పోతున్నాయి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకూ డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు అన్న తేడా లేకుండా రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఎలీజా టెస్ట్ లు సగటున తొంభై శాతం పాజిటివ్ రావడంతో రోగుల గుండెల్లో గుబులు పుడుతోంది.

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ప్రతి గుమ్మంలో కన్నీరు, ప్రతి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ మహమ్మారి బారినపడి పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవలె కురిసిన భారీ వర్షాలకి ఏజెన్సీలో అంటు రోగాలు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో పల్లె ప్రాంతాలు మంచం పడుతున్నాయి. డెంగ్యూ పేరు వినగానే చింతలపల్లి వాసులు భయంతో వణికిపోతున్నారు. డెంగ్యూ వస్తే తమ పరిస్థితి ఏంటని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చింతలపల్లి గ్రామంలో గడిచిన పదిహేను రోజుల్లో డెంగ్యూ జ్వరం బారిన పడి ఐదుగురు చనిపోయారు.

మరో నలభై మందికి పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి అంటువ్యాధులు సోకి జనం మంచం పడుతున్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థితిలో లేని వారు సర్కారు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చింతలపల్లి గ్రామంలో పదిహేను రోజుల్లో ఐదుగురు చనిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న జాన్సీ అనే యువతికి డెంగ్యూ సోకి చనిపోయింది. ఈ ఘటనలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి గ్రామాల్లో స్పెషల్ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక వైద్యుల బృందం గ్రామంలో పర్యటించి వైద్య పరీక్షలు మందులను బాధితులకు అందజేశారు.