English | Telugu
కరోనా చేసిన పెళ్లి!
Updated : Mar 17, 2020
కరోనా దెబ్బకు ఆన్‌లైన్‌లో నిఖా జరిగింది. పెళ్లి కొడుకు సౌదీలో వున్నాడు. పెళ్లి కుమార్తె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో వుంటుంది. అయితే అనుకున్న సమయం ప్రకారం పెళ్లి కొడుకు ఇండియా చేరుకోలేకపోయాడు. విమాన ప్రయాణాల్లో ఆంక్షలు ఉండటంతో సౌదీ నుంచి వరుడు రాలేకపోయాడు. దీంతో ఇరువైపుల పెద్దవారు పరస్పర అంగీకారంతో అనుకున్న సమయానికే నిఖా కానిచ్చారు. టెక్నాలజీ ని ఉపయోగించి ఆన్ లైన్‌లోనే నిఖా వేడుక జరిగింది. బంధువులంతా ఆన్‌లైన్ షాదీలో పాల్గొని షాదీముబారక్ చెప్పారు.
ముస్లిం సాంప్రదాయం షరియత్ ప్రకారం పెళ్ళి జరగాలంటే ఇద్దరు సాక్షుల సమక్షంలో పెళ్ళి కొడుకు, పెళ్ళికూతరు సంతకం పెట్టాలి. ఇద్దరి సంతకాలు అయితే పెళ్ళి జరిగినట్లే. ఆ తరువాత పెళ్ళి కూతురు విదాయి అంటే వీడ్కోలు సందర్భంగా దావత్ చేసుకుంటారు.
స్థానికంగా వుండే ఖాజీ తో ఆపాటు ఇద్దరు సాక్షుల సమక్షంలో పెళ్ళి కూతురు నిఖా నామాలో సంతకం పెట్టింది. ఆ కాపీని స్కాన్ చేసి పెళ్ళి కొడుకుకు మెయిల్ చేశారు. మెయిల్ కాపీ ప్రింట్ తీసుకొని వరుడు సంతకం చేశారు. సౌదీలో అతని ఇద్దరు స్నేహితులు ఈ పెళ్లికి సాక్షిగా సంతకాలు చేశారు. మొత్తం వ్యవహారం ఆన్‌లైన్‌లో రికార్డు చేసుకున్న తరువాత బంధువులు పెళ్ళికొడుకుకు ఆన్‌లైన్‌లో షాదీముబారక్ చెప్పి బంధువులంతా మటన్ బిర్యానీ తిని హ్యాపీగా వారి ఇళ్ళకు వెళ్లిపోయారట. పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని తెగ మదన పడిపోయిన పెళ్ళికూతురు తండ్రి నిఖా జరగడంతో తృప్తిగా బిర్యానితో పాటు డబుల్ కా మీఠాకూడా లాగించాడట.