English | Telugu

11 రూపాయ‌ల‌కే కరోనా తాయెత్తు!

మాస్కు కంటే త‌న తాయెత్తే ప‌వ‌ర్‌ఫుల్ అంటున్న దొంగ‌బాబా

కరోనా వైరస్ మన దేశంలో దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టాడు యూపీలో దొంగ బాబా అహ్మద్ సిద్ధిఖ్‌. అంతా అమాయక ప్రజలు ఆ బాబాల దర్శనం కోసం క్యూ క‌ట్టారు. తాయత్తు కట్టుకుంటే కరోనా వచ్చినా ఎగిరిపోతుందంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న దొంగబాబాకు యూపీ పోలీసులు క‌ట‌క‌టాల వెనుక‌కు నెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. చేతికి తానుకట్టే మంత్రించిన తాయెత్తుతో కరోనా పారిపోతుందంటూ అహ్మద్ సిద్ధిఖీ అనే ఓ దొంగబాబా ఏకంగా బోర్డు పెట్టే తామెత్తులు అమ్మాడు. మందులు ఎలాగు లేవు క‌నుక తానే కరోనా వ్యాపారానికి తెరలేపాడు. ఒక్కో తాయెత్తు ధర కేవ‌లం 11 రూపాయ‌లు మాత్ర‌మేనంటూ స్థానికంగా విస్తృతంగా ప్ర‌చారం చేసుకున్నాడు.

ఇంకేముంది. అమాయక ప్రజలు క్యూలైన్లు కట్టి మరీ తాయెత్తు కట్టించుకుంటున్నారు. మాస్కులకంటే ఇదే బెటర్ అనుకుంటున్న ప్రజలు.. తాయెత్తు కట్టుకుంటూ మోసపోతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ప్రజలను మోసం చేస్తున్నా బాబా అవతారమెత్తిన సిద్ధిఖీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.