English | Telugu

కూక‌ట్‌ప‌ల్లిలో వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా, దేశంలో బాధితుల సంఖ్య 294

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ను నిరోధించకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. దావానంలా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టిడి చేయకుండా అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 294కి చేరింది. వీరిలో 267 మందికి ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 23 మంది మాత్రం ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 4గా ఉంది. కరోనా వ్యాధి సోకిన వారిలో భారతీయులు 256 మంది ఉండగా... విదేశీయులు 38 మంది ఉన్నారు. మొత్తం పాజిటివ్ కసుల్లో విదేశాల నుంచి వచ్చిన భారతీయులతో పాటు.. స్థానికులు 256 మంది ఉంటే.. దేశానికి వచ్చిన విదేశీయులు 38 మంది కరోనా పాజిటివ్ గా తేలింది.

దేశంలో ఇప్పటివరకూ 63 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కేరళ 40 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 26, ఉత్తరప్రదేశ్ 24, రాజస్థాన్ 23 కేసులతో ఉండగా... తెలంగాణ 21 కేసులతో ఆరో స్థానంలో ఉంది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఫేజ్-2లో ఉండే ఓ మహిళకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ మహిళను వైద్యం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె సోదరుడు ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఇంటిలో ఉన్న మరో ఇద్దరికి కరోనా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అతనితో సంబంధం ఉన్న అందరినీ గుర్తించామన్నారు. వాళ్లని కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి.ఇప్ప‌ట్టి వ‌ర‌కు 3 కేసులు పాజిటివ్ వచ్చాయి'అని మంత్రి తెలిపారు.