English | Telugu

ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి తెలుగురాష్ట్రాలు వ‌ణుకుతున్నాయి!

విశాఖలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి (65) కరోనా సోకినట్టు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈనెల 12 నుంచే జ్వరం ఉన్నా.. మామూలుదేనని భావించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగినట్టు తెలియడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి లక్షణాలతో ఈనెల 17న విశాఖలోని అంటువ్యాధుల ఆసుపత్రిలో చేరారు. అతని ప్రయాణ వివరాలు చూస్తే..

* ఫిబ్రవరి 21న జెద్దా నుంచి మక్కాకు, అక్కడినుంచి మదీనాకు విమానాల్లో వెళ్లారు.

* మళ్లీ మక్కా వచ్చి మార్చి 9న హైదరాబాద్‌కు వచ్చారు.

* 10న విమానాశ్రయం నుంచి మెహిదీపట్నంలోని కుమార్తె ఇంటికెళ్లారు. 11న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ బీ1 బోగీలో బయల్దేరి విశాఖకు 12న వచ్చారు. అల్లీపురంలోని ఆయన ఇంట్లో పలువురు వచ్చి కలిశారు.

* 13న శుక్రవారం ఓ మసీదులో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

* 14న జ్వరంతో మంచం మీదనుంచి లేవలేకపోయారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఓ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.

* 17న మర్రిపాలెంలో వైద్యుడి వద్దకు వెళ్లగా.. ఆయన కరోనా లక్షణాలు గమనించి ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రికి పంపారు. క్లినిక్‌లో ఈ వృద్ధుడు ముగ్గురు వైద్యసిబ్బందిని నేరుగా కలిశారు. తర్వాత నమూనాలు పంపిన రెండు రోజులకు వ్యాధి ఖరారైంది.

* ఆయన కుటుంబంలో 58 ఏళ్ల భార్య, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్యకూ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు.

* గోపాలపట్నంలో ఉంటున్న తల్లి, ఇద్దరు సోదరులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసి వారినీ పరీక్షలకు తరలించారు.

* మర్రిపాలెంలో ఆయన్ను పరీక్షించిన వైద్యుడు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు.

ఆ వ్యక్తి నిర్లక్ష్యానికి క‌రోనా ఎంత మందికి సోకిందోన‌ని ఏపీ, తెలంగాణా అధికారులు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌ట్టికైనా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి మన కోసం...మనం బ్రతికే సమాజం కోసం అప్ర‌మ‌త్తంగా వుందాం.