English | Telugu

కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్ కు చప్పట్లు.. కవితకు చివాట్లు!!

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తగు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై.. కేంద్రం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ సూచనలు తీసుకుంది. అయితే ఒక వైపు కరోనా కోసం సీఎం కేసీఆర్ ఇంతలా చర్యలు తీసుకుంటుంటే.. ఆయన కూతురు కల్వకుంట్ల కవిత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించినట్లు తెలుస్తోంది. వీడియోలో.. ఒకేచోట 500 మందికి పైగా మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ.. సమావేశాలు, వివాహాలు, వేడుకలు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ నేతలే ఇలా రిసార్ట్స్ లో గుంపులుగా ఉంటూ చిందులేయడంతో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రజాక్షేమం కంటే రాజకీయం ముఖ్యమా? ఓ వైపు కరోనా అంతలా విజృంభిస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.