English | Telugu
దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే?
Updated : Mar 16, 2020
కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే లావుంది. రాహుల్ గాంధీ బాధ్యతా రాహిత్యం, సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీలున్నంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాను విశ్రాంతి తీసుకుంటానని ఆమె పలుమార్ల పార్టీ సీనియర్ నాయకులతో చెబుతున్నారు.
కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశంపై పార్టీ రెండుగా చీలిపోవటంతోపాటు ఇరు పక్షాల మధ్య అంతర్యుద్ధం కొనసాతోంది. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రమే పార్టీ అధ్యక్షులుగా కొనసాగాలని ఒక వర్గం వాదిస్తోంటే రెండో వర్గం సీనియర్ నాయకులలో ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకుని ముందుకు సాగాలని వాదిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఇంత కాలం తెర వెనక కొనసాగిన యుద్ధం ఇప్పుడు బహిరంగ వేదికలెక్కింది. కాంగ్రెస్ చుక్కాని లేని నావ మాదిరిగా కొట్టుకుపోతోందంటూ శశిథరూర్ బహిరంగంగా తన ఆవేదనను వెళ్లగక్కారు. రాహుల్ గాంధీ చుట్టూ చేరిన కోటరీ మూలంగా గులాం నబీ ఆజాద్, అహమద్ పటేల్ లాంటి సీనియర్ నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.
సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవ్వరు ఆమోదించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బయటి వారిని అధ్యక్షుడుగా ఎన్నుకోకుండా ఈ రాద్ధాంతం ఏమిటని శశిథరూర్, జయరాం రమేష్, అభిషేక్ సింఘ్వి లాంటి నాయకులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు.
కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావటం లేదు. రాహుల్ గాంధీనే మరోసారి పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవటం మంచిదని పార్టీలోని ఒక వర్గం పట్టుపడుతోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు ససేమిరా అంగీకరించటం లేదు. రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంగీకరించటం లేదు కానీ అనునిత్యం ఏదోఒక ప్రకటన, ట్వీట్ చేయటం ద్వారా పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నారు.
పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అధిష్టానవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌లు పని చేయటం మానివేసి చాలా కాలమైంది. కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పి.సి.సి. అధ్యక్షులు తమ ఇష్టానుసారం రాజకీయం నడిపించుకుంటున్నారు తప్ప అధినాయకత్వం ఆదేశాల మేరకు పనులను నడిపించటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది.
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది అభ్యర్థులు ధరావతును కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పలుకుబడి ఏ పాటిదనేది ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ఓటర్లందరు ఆం ఆద్మీ పార్టీకి వెళ్లిపోయారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తరువాతి స్థానం బి.జె.పి.ది. కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పుడు మూడు, నాలుగో స్థానానికి నెట్టివేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కార్యకర్తలు కరువవుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ సంగతి అందరికి తెలిసిందే. యు.పి. రాజకీయాలలో బి.జె.పి. తరువాత స్థానం సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలది. కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది.
బిహార్‌లో జె.డి.యు., బి.జె.పి., ఆర్.జె.డి. తరువాత కాంగ్రెస్ ఉంటోంది. అదికూడా ఆర్.జె.డి. భుజాలెక్కి కూర్చోవటం వల్లనే కాంగ్రెస్ పరువు కొంతైనా దక్కుతోంది.
కర్నాటకలో బి.జె.పి. తరువాత దేవేగౌడ నాయకత్వంలోని జె.డి., ఆ తరువాతనే కాంగ్రెస్ అంటే మూడో స్థానం కాంగ్రెస్‌ది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూ స్థాపితమైపోయింది.
తెలంగాణాలో భూస్థాపితమయ్యే పరిస్థితులను కాంగ్రెస్ నాయకులే సృష్టించుకుంటున్నారు.
తమిళనాడులో కాంగ్రెస్ అస్తిత్వం ఏ పాటిదనేది అందరికి తెలిసిందే. డి.ఎం.కె. మద్దతు లేకపోతే కాంగ్రెస్ మనుగడే ఉండదు.
కేరళలో కాంగ్రెస్ పరిస్థితి కొంతే మెరుగే. రాష్ట్ర ప్రజలు ఒకసారి కాంగ్రెస్‌కు మరోసారి వామపక్షాలకు అధికారం అప్పగిస్తున్నారు.
మహారాష్టల్రో మొదటి స్థానం బి.జె.పి.దైతే రెండో స్థానం శివసేనది. మూడో స్థానంలో ఎన్.సి.పి. ఉంటే నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఉన్నది.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్‌లో అధికారంలోకి వచ్చినా అక్కడ పార్టీకి ఆశించిన స్థాయిలో సీన్ లేదు.
జార్కండ్‌లో ప్రాంతీయ పార్టీ జె.ఎం.ఎం. తోకపట్టుకుని ముందుకు సాగుతోంది.
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి క్యాప్టెన్ అమరీందర్ సింగ్. రాహుల్ గాంధీ రాజకీయం అమరీందర్ సింగ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే ఆయన నేరుగా సోనియా గాంధీతో మాట్లాడుకుంటాడు.
ఒకప్పుడు రాజ్యమేలిన ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైపోయింది.
ఉత్తరాధిలోని పలు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.