English | Telugu

సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసిన సీఎం జగన్

పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్న వైసీపీ సర్కార్ వాటికి ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఉద్యోగులకు నియామక పత్రాల్ని అందజేశారు. కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం నిజంగా దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని గర్వంగా చెప్పారాయన.

ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, తద్వారా ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వగలిగారన్నారు. ఇది కాక ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని, ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరి కొత్త రికార్డు అని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే అక్షరాలా నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ రికార్డు మరింత గొప్పగా, మరింత గర్వపడేలా ఉండాలంటే ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగంగా తీసుకోకుండా, ఒక ఉద్యమం మాదిరిగా తీసుకోవాలి అని జగన్ అన్నారు.

సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుందని, ఉద్యోగం వచ్చిన ప్రతీ ఒక్కరూ అలాంటి గొప్ప అదృష్టవంతులు అని, కాబట్టి తమ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి అని జగన్ ఉద్యోగస్తులకు సూచించారు. ఉద్యోగ పరిసర ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేయండని, అక్కడి ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా లంచాలు లేని, వివక్ష లేని, పారదర్శక పాలన అందించమని ఉద్యోగస్తులను కోరారు.