English | Telugu

నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయండి: సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాతపరీక్షల్లో అర్హత సాధించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం వైఎస్ జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం సహా మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగాల చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని సగర్వంగా చెబుతున్నానని అన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలపైగా ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. దాదాపు లక్షన్నర శాశ్వత ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. గ్రామ వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఉద్యోగులు నిజాయతీగా, లంచాలు తీసుకోకుండా పని చేయాలని అన్నారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సీఎం కోరారు.