English | Telugu

అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి

కొణిదెల అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయని కొన్నాళ్లుగా మీడియాలో వినిపించే మాట. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలో మెగా బ్రదర్స్ మధ్య చీలిక వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, అన్నయ్య చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి తమ్ముడు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంతేనా? అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు అతిథిగా హాజరయ్యాడు. 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరు ఎన్ని రికార్డులు బద్దులుకొట్టినా చిరంజీవిగారి అనుభవాన్ని కొట్టలేరని ఆవేశంగా మాట్లాడాడు. దాంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనని చాలామంది వ్యాఖ్యానించారు.

'మీకు, మీ తమ్ముడికి మధ్య గ్యాప్ భర్తీ అయినట్టేనా?' అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవిని ప్రశ్నిస్తే... "అసలు గ్యాప్ వస్తే కదా... భర్తీ అవడానికి" అని సమాధానం ఇచ్చారు. అదంతా మీడియా సృష్టేనని, అటువంటి వార్తలు బాధ కలిగిస్తాయని ఆయన అన్నారు. అయితే, అమ్మ దగ్గర కలిసినప్పుడు వాటి గురించి నవ్వుకుంటామని చిరంజీవి అన్నారు. తమ్ముడితో రాజకీయ చర్చలు ఉండవని, రావని ఆయనస్పష్టం చేశారు. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు 'సినిమా పార్టీ' అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.