English | Telugu

ఏబీ వెంకటేశ్వరరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ!!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. బెంగళూరులో వ్యవసాయం చేస్తానని చెబుతున్న వెంకటేశ్వరరావుకు, అక్కడ వంద ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ భూముల మొత్తం విలువ వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి ఆస్తులు సంపాదించారని, వాటిని చూసుకునే తీరిక కూడా ఆయనకు లేదని అన్నారు. ఇలాంటి వ్యక్తి తనను సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తారే తప్ప పనిష్ మెంట్ గా భావించరని సెటైర్లు వేశారు.

ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహశక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై, కేంద్రం సీరియస్ గా స్పందించి సమగ్ర విచారణ జరిపితే, ఆయనపై 124 A సెక్షన్ కింద కేసు నమోదు చేసి తీరుతుందని, దేశ ద్రోహిగా ఆయన ప్రజల ముందు నిలబడతారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వెంకటేశ్వరరావుతో పాటు భాగస్వామి అయిన ఘట్టమనేని శ్రీనివాస్ పైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు. చిత్తూరు జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారిగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు శిష్యుడు రామ్ కుమార్ కు రెండు వందల కోట్లు ఆస్తులు ఉన్న విషయం ఈ మధ్యనే బయటపడిందని అన్నారు. వెంకటేశ్వరరావు ఈ దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఉందని, ఆయనకు లుక్ ఔట్ నోటీసు జారీ చేయాలని కేంద్రానికి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.