English | Telugu

కంట్రోల్ బాబూ.. కంట్రోల్.. కంట్రోల్ రూంలను మర్చిపోలేకపోతున్న చంద్రన్న...

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా ఒక కమాండ్ కంట్రో రూం, ఒక టోల్ ఫ్రీ నంబర్ తప్పనిసరి. అవి పుష్కరాలైనా, తుఫాన్లైనా, కరువైనా వీటికి మాత్రం కరువు లేకుండా చూసుకునే వారు. ఆఖరికి పాలన మొత్తం కమాండ్ కంట్రోల్ రూంలోనే చేసిన ఘనత ఆయనది. ఆ అలవాటు ప్రకారమే చంద్రబాబు అధికారం కోల్పోయినా కంట్రోల్ రూంలు ఏర్పాటు మాత్రం మానలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై టిడిపి నాయకులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆ పార్టీ అధినేత పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ శ్రేణులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, వస్తువులు పంపిణీ చేస్తుంటే వీడియోలు తీసి షేర్‌ చేయాలన్నారు. వాటిని ఎన్నికల సంఘానికి పంపుతామని అంటున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ భవన్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 7995014525 ఏర్పాటు చేశారు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్ ముఖ్యమంత్రి హోదాలో డబ్బు పంపిణీ చేసినట్టు తేలితే అనర్హత వేటు తప్పదని ప్రకటన చేశారు. దానికి రివర్స్ గా చంద్రబాబు అధికార పార్టీ వాళ్ళు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం విశేషం.

ఇక్కడే వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు అయన అధికారంలో ఉండగానే ఈ కంట్రోల్ రూంలు, టోల్ ఫ్రీ నంబర్లు వల్ల ఒరిగేదేమీ ఉండదన్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా వినలేదనీ, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటని అంటున్నారు. కొందరు చంద్రబాబు స్వపక్షం వాళ్ళు కూడా ‘బాబ్బాబు తగ్గవయ్యా అన్నా..వినలేదు ఇప్పుడు నువ్వేడా’ అని కోట శ్రీనివాసరావు శతృవు సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు.

ఇకపోతే తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో ఓడి పోవడం ఖాయమని..తర్వాత చంద్రబాబుకు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం అనే సాంప్రదాయ వనరు ఎలాగూ ఉంటుంది. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే మాట వినని ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలా వింటుంది అని ఎలాగూ చెప్తారని, ఇలాంటి నంబర్లు ఎన్ని పెట్టుకున్నా చివరికి నంబర్ గేమ్ లో గెలిచేది మేమే అని అధికార వైసీపీ అంటోంది.