English | Telugu
వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు.. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు!
Updated : Feb 10, 2020
విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్‌యూ విద్యార్థులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. వైస్ ఛాన్సలర్ ప్రవర్తన దారుణంగా ఉందని, ఆయన సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారు అని ప్రశ్నించారు. సీఎం ఆలోచలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. వైస్ ఛాన్సలర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు, యూనివర్సిటీని స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సైకో ...ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు అని చంద్రబాబు విమర్శించారు.
చంద్రబాబుతో పాటు సిపిఐ నేత రామకృష్ణ కూడా విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ అక్రమాల చిట్టా మావద్ద ఉంది, యూనివర్సిటీ లో జరిగిన ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు.