English | Telugu

రాజ‌కీయ కంపులో రాజ‌కుటుంబం

మాన్సాస్‌ ట్రస్ట్ వివాదంపై అమీతుమీకి సిద్ద‌మంటున్న రాజ‌కుటుంబం

వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమిస్తారా? ప్రభుత్వ జోక్యం సరికాదంటున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు
చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? కుటుంబ‌స‌భ్యులే వేధిస్తున్నారంటున్నసంచైత.

మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం ముదురుతోంది. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక్‌ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం వైఖరి వింతగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు, దేవాలయం భూములపై ప్రభుత్వం కన్నేసిందని.. అందుకే దొడ్డి దారిన అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమించడం మంచిది కాదని.. దాతల భూములు ఆలయానికే చెందాలని అభిప్రాయపడ్డారు. ట్రస్టు నిబంధనల ప్రకారం ఆడవాళ్లు పదవి చేపట్టకూడదన్నారు. అసలు జీవోలో ఏముందో బయట పెట్టకపోతే న్యాయపోరాటం చేస్తాను అన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే ఎందుకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు.

రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై ఆ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు ఘాటుగా స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కుటుంబ సభ్యులే తనపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని సంచైత ఆవేదన వ్యక్తంచేశారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ట్ర‌స్టు బాధ్య‌లు త‌నకు అప్ప‌గించ‌డాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయ‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన నియామకంపై ఎవరైనా న్యాయస్థానానికి వెళ్లినా పోరాటం చేస్తానని తెలిపారు. ట్రస్ట్‌ భూములు, దేవదాయ భూములు ఎవరికీ చెందనివ్వమని ఆమె స్పష్టంచేశారు. తన తాతగారు స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా పేదలకు సేవలందిస్తానని చెప్పారు.