English | Telugu

ఆర్టీసీ లో 5000 మంది అప్రెంటిస్ లకు అవకాశం

ఎ.పి.ఎస్‌.ఆర్‌ట‌.టి.సి. 4జోన్ల (విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్ల) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ఏ. కోటేశ్వర రావు ఈ మేరకు 03-03-2020న ఆదేశాలు జారీ చేశారు. వివిధ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసి తదుపరి సమాయత్తం కావలసిందిగా కూడా ఆదేశాలు జారీచేయబడినవి. మార్చి 7 వతేది లోపు నోటిఫికేషన్లు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీ లోగా పూర్తి చేయనున్నారు.

అర్హత కలిగిన ఐ.టి.ఐ అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in వెబ్సైట్ నందు అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందుకు గడువు తేదీ 21-03-2020. దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన సంబంధిత జోన్ల శిక్షణా కళాశాలల కమిటీలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుతారు. ఏప్రిల్ 13వ తేదీన ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. కాగా ఎంపికైన అభ్యర్థులను ఏప్రిల్ 15 న రీజియన్ /వర్కుషాపులకు కేటాయిస్తారు.

సంస్థ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ.టి.ఐ అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్ రూ.1500/- , సంస్థ కాంట్రిబ్యూషన్ రూ.5431/-కలిపి మొత్తంగా ఒక్కొక్కరికీ రూ.6931/- చొప్పున వీరందరికీ ఏడాదికి సుమారు 9.06 కోట్ల మొత్తం స్టైపండ్ రూపంలో చెల్లిస్తున్నది. అంటే మొత్తంగా 5000 మందిని అప్రెంటిస్ లుగా తీసుకోవడం వలన సంస్థ ఇంకా అదనంగా రూ.25 కోట్ల మొత్తం స్టైపెండ్ రూపంలో వెచ్చించనున్నది.

సంస్థ వి.సి అండ్ ఎం.డి మాదిరెడ్డి ప్రతాప్, ఇటీవల డిపోల పర్యటనలు జరిపారు. డిపో గ్యారేజీలలో మరియు వర్క్ షాపులలో పనిచేస్తున్న అప్రెంటిస్ ల ప‌నితీరును మెచ్చుకున్నారు. కేవలం తమ విధులు మాత్రమే కాకుండా సంస్థకు పనికి వచ్చే పలు విధాలైన నైపుణ్యాలను చూపుతూ సంస్థ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నట్లు గమనించారు.

ఈ నేప‌థ్యంలో అప్రెంటిస్ ల సేవలను మరింతగా ఉపయోగించుకోవడంలో భాగంగా ఎం.డి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు మరో 5,000 అప్రెంటిస్ ల నియామకానికి చర్యలు ప్రారంభమయ్యాయి.