English | Telugu

'స్థానిక' ఎన్నికలపై హైకోర్టు లో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్.. 19 కి విచారణ వాయిదా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హై కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తో సంప్రదింపులు జరపకుండా ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు అవలేదని, దేశ వ్యాప్తంగా 100 కేసులు మాత్రమే నమోద య్యాయని చెప్పిన పిటిషనర్ తరపు న్యాయవాది. గవర్నర్ ను కలిసి వాయిదా కారణాలు వివరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.ఇదే విషయానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టు లో రేపు విచారణకు ఉన్న కారణంగా విచారణ వాయిదా. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు.

ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల వాయిదా అంశంపై అటు సచివాలయం లోనూ, ఇటు రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయమై చర్చింటానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కార్యాలయం చేరుకున్న మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి .కాసేపట్లో ఆయన సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన ప్రభుత్వం, వైసీపీ నేతలు, ఈ రెండు రోజులూ చాలా కీలకమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రం లో రాజ్యాంగ సంస్ధలతో సై అంటే సై అంటున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడో పదం విపరీతంగా చికాకు తెప్పిస్తోంది. అదే విచక్షణ. గతంలో ఏపీపీఎస్సీఛైర్మన్, మండలి ఛైర్మన్ విచక్షణాధికారాన్ని వాడి జగన్ సర్కార్ కు చుక్కలు చూపిస్తే, తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సైతం విచక్షణ అధికారంతో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జగన్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తమకున్న అధికారాలను నిబంధనల మేరకు వినియోగించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు విచక్షణ అనే పదాన్ని వాడుతుంటారు. ఇదే కోవలో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల నేపథ్యంలో తొలిసారి విచక్షణ అనే పదం తెరపైకి వచ్చింది. అప్పట్లో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష పేపర్ లీకేజీ అయిందని ఆరోపణలు వచ్చినా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తన విచక్షణ మేరకు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది. ఆ తర్వాత ఆయన్ను తొలగించేందుకు ప్రయత్నించినా రాజ్యాంగ పదవి కాబట్టి అది సాధ్యంకాలేదు.

ఏపీ శాసనసభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో ఎలా అడ్డుకోవాలో విపక్ష టీడీపీకి తట్టలేదు. దీంతో తొలుత రూల్ 71 ప్రకారం అసాధారణంగా చర్చను కోరిన టీడీపీ, అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ఛైర్మన్ గా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్ కు విచక్షణాధికారాన్ని వాడాల్సిందిగా సలహా ఇచ్చింది. దీంతో ఆయన కీలకమైన రెండు బిల్లులను ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా విచక్షణాధికారం మేరకు సెలక్ట్ కమిటీకి పంపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండోసారి విచక్షణాధికారంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికల పోరును ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన విచక్షణ అధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో విచక్షణ అనే పదం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరించలేని సందర్భాల్లో ఈ విచక్షణ అనే పదాన్ని ఆయా సంస్ధల అధిపతులుగా ఉన్నవారు తెరపైకి తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ విధులు నిర్వర్తించేందుకు బిజినెస్ రూల్స్ ఉన్నప్పుడు ఈ విచక్షణాధికారం ఎందుకు వాడాల్సి వస్తోందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఏ మూడు అంశాల మీద, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తో జరిగే భేటీ లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.