English | Telugu

రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు.

పంచాయతీ, మున్సిపల్, జిల్లా- మండల పరిషత్ పాలకవర్గాలకు 2018లోనే గడువు ముగిసింది. గత కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 2020 జనవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసి రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు.

రాజ్యాంగం ప్రకారం 50 శాతానికి లోబడి ఉండాల్సిన రిజర్వేషన్లు 59.85 శాతంగా నిర్ణయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను సవరించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

ఫలితంగా మార్చి 3వ తేదీన కోర్టు తీర్పు వచ్చిన తర్వాత హడావిడిగా రిజర్వేషన్లను సవరిస్తూ మార్చి 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ముగింపు దశకు రావడంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందనే సంకేతాలు వచ్చాయి.

అయితే, అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు బదులుగా మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఏపీలో అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కూడా గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం, అసెంబ్లీ చట్టాలకు లోబడి పనిచేసే ఎస్ఈసీ నిర్ణయం పట్ల గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను కోర్టు ఆదేశాల ప్రకారమే నిర్వహిస్తున్నారని రాజకీయ పరిశీల‌కులు చెబుతున్నారు. "పిల్ 02/2020 ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు చేసిన తర్వాతే ఎన్నికల నిర్వహణ సాగుతోంది. మార్చి 3 నాటికే ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు తెలిపారు. వాస్తవానికి 2018లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది."

"ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల గురించి పేర్కొనలేదు. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా ఆ విషయం ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజ్యాంగబద్ధమైన పదవే అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు పంచాయతీరాజ్ కమిషనర్‌ను సంప్రదించి ఉండాల్సింది. దానికి భిన్నంగా జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు లీగ‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.