English | Telugu
కోడ్ అమల్లో ఉంటే సీఎస్, సీఎం ఆదేశాల్ని ఎలా పాటిస్తారు?
Updated : Mar 16, 2020
స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించిన తీరు వివాదాస్పదం అయింది.
ఎన్నికలు కేవలం వాయిదా పడ్డాయి. రద్దు కాలేదు. కాబట్టి అవి పూర్తయ్యేవరకు కోడ్ అమల్లోనే ఉంటుంది. ఒక్కసారి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వస్తే సీఎస్ సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ పరిధిలో పనిచేస్తున్న సీఎస్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని శిరసావహించకుండా, సూచనలు, సలహాలు, విజ్ఞప్తులు చేయడం ఎన్నికల కమిషన్ ఆదేశాల ధిక్కరణ కిందకే వస్తుందట.
ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘానికి దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారాలైతే ఉన్నాయో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో అలాంటి అధికారాలే ఉంటాయి.
పార్టీలు, ప్రభుత్వాలు పక్కనపెడితే ఒక రాష్ట్ర సీఎస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ధిక్కరించడాన్ని డీవోపీటీ సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల సంఘాలున్నాయి. ప్రభుత్వాలు, అందుకనుగుణంగా పనిచేసే సీ ఎస్‌లు ఉంటారు. కాబట్టి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన విషయాన్ని తేలిగ్గా వదిలేస్తే అన్ని రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘం హక్కులను కాలరాసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోగా ఆ నిర్ణయం మార్చుకోవాలంటూ తిరిగి సూచనలు, సలహాలు, విజ్ఞప్తులు చేయడం అసాధారణమేనని రాష్ట్రంలో ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి.