English | Telugu

మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగ‌ళ‌వారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డిని.. ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టును కూడా కోర్టుకు అందజేశారు. 2015లో స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఓటు విషయంలో రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది ప్రస్తుతం కీలకం కానుంది. అయితే అంతకుముందే స్టీఫెన్‌సన్.. ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు.

2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా.. ఆయన చాన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యండెడ్ గా ఏసీబీకి దొరికిన రేవంత్ రెడ్డిపై పలు అభియోగాలతో ఛార్జీ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు.