English | Telugu

నజ్రీబాగ్ నిజాం ప్యాలెస్‌ వేలానికి!

నకిలీ హక్కుదార్లు త‌ప్ప‌డు పత్రాలు సృష్టించి డ‌బ‌ల్ సేల్ కు పాల్ప‌డ‌డంతో వేలం వాయిదా ప‌డింది. నకిలీ పత్రాలు సృష్టించి డ‌బ‌ల్ సేల్ చేసి వంద కోట్లు మింగిన ఉదంతం హైద‌రాబాద్‌లో తాజాగా సంచ‌ల‌నం సృష్టించింది. ఒకరికి అమ్ముకోవడమే కాకుండా, అదే భవనాన్ని వేరొక సంస్థ వద్ద తాకట్టు పెట్టి కోట్ల రూపాయ‌లు నొక్కేసిన కేటుగాళ్ళ‌పై కేసు న‌మోదైంది.

కింగ్‌కోఠిలోని నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను రూ.110 కోట్ల కు బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌ఈఐ ఎక్యిప్‌మెం ట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు తాకట్టుపెట్టారు. అయితే ఆ విష‌యాన్ని దాచి పెట్టి ఆషి రియల్టర్స్‌ నిర్వాహకులు సుఖేష్‌గుప్తా, నీతూగుప్తలు కశ్మీర్‌కు చెందిన ఐరిస్‌ హాస్పిటాలిటీకి దానిని విక్రయించారు.

నిజాం వైభవానికి ప్రతీకగా ఉన్న భవనాల్లో కింగ్‌కోఠిలోని నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ (పరాదాగేట్‌) ఒకటి. ఈ భవనానికి జీపీఏగా ఉన్న ఎస్ర్తా నుంచి ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే రియల్‌ఎస్టేట్‌ సంస్థ నాలుగేండ్ల క్రితం రూ.150 కోట్లకు కొనుగోలుచేసింది. ఆ సంస్థలో పనిచేసిన రవిచంద్రన్‌, సురేశ్‌కుమార్‌ ఆషి రియల్టర్స్‌ నిర్వాహకులు సుఖేశ్‌గుప్తా, నీతూగుప్తాతో కుమ్మక్కై నజ్రీబాగ్‌ ప్యాలెస్‌కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో ఎస్‌ఆర్‌ఈఐ ఎక్యిప్‌మెం ట్‌ ఫైనాన్స్‌ సంస్థవద్ద తాకట్టుపెట్టి రూ.110 కోట్లు రుణం తీసుకున్నారు.

నజ్రీబాగ్‌ ప్యాలెస్‌తోపాటు హఫీజ్‌పేట్‌లోని ఎనిమిదెకరాల స్థలాన్ని కూడా తాకట్టు పెట్టారు. గడువులోగా రుణాన్ని చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ తాకట్టు ఉన్న ఆస్తులను వేలంవేసింది. హఫీజ్‌పేట్‌ స్థలాన్ని వేలంవేయగా రూ.102 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన అసలు, వడ్డీని రాబట్టుకునేందుకు నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ వేలా నికి ప్రయత్నించింది. అప్పటికే ఆ భవనాన్ని మరో సంస్థకు విక్రయించినట్టు గుర్తించి జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదుమేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే భవనం విక్రయానికి సంబంధించి ముంబై ఆర్థిక నేరాల విభాగంలో కూడా గత ఏడాది రవిచంద్రన్‌, సురేశ్‌కుమార్‌పై కేసు నమోదైంది. కాగా, నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను మొదట కొనుగోలుచేసిన నిహారిక సంస్థ ప్రతినిధులు గత ఏడాది భవనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు హైదరాబాద్‌ వచ్చారు.