English | Telugu
అమ్మ సెంటిమెంటే సింగ్ ను నిర్భయ ముద్దాయిలకు దగ్గర చేసిందా?
Updated : Mar 20, 2020
* వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి కి అత్యంత ఆప్తుడు లాయర్ సింగ్
* సింగ్ వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా !
అమ్మ సెంటిమెంట్, ఆ లాయర్ ని నిర్భయ కేసులో ముద్దాయిల తరఫున వాదించేలా చేసిందా ? అవుననే అంటున్నారు ఆ లాయర్ సన్నిహితులు. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాలేదు. తాము కేసును టేకప్ చేయబోమని పలు బార్ అసోసియేషన్లు బాహాటంగా ప్రకటించాయి. నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ సింగ్ భార్య పునీతా దేవి తొలుత ఏపీ సింగ్ ను కలవగా.. కేసు తీసుకోబోనని వెనక్కి పంపించారు. అయితే, సింగ్ దగ్గర జూనియర్ గా పనిచేస్తోన్న లాయర్ ద్వారా.. ‘మదర్ సెంటిమెంట్' గురించి తెల్సుకున్న ఓ తీహార్ జైలు అధికారి.. ఆ సమాచారాన్ని అక్షయ్ కుటుంబానికి చేరవేశాడు. దీంతో అక్షయ్ భార్య పునీతా.. నేరుగా ఏపీ సింగ్ తల్లి విమలా సింగ్ ను కలిసి వేడుకున్నారు. దోషుల కుటుంబాల పరిస్థితి విని చలించిపోయిన విమలా సింగ్.. కేసు టేకప్ చేయాలంటూ కొడుకు ఏపీ సింగ్ కు సూచించింది. కాదనలేని స్థితిలో ఆయన నిర్భయ కేసులోకి ఎంటరయ్యారు.
1997లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందిన తొలినాళ్లలో ఆయనకు చంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాదాస్పద తాంత్రికుడిగా, అప్పటి ప్రధాని పీవీకి ఆథ్యాత్మిక సలహాదారుగా, ఇటు రాజకీయ, వ్యాపార వర్గాలు, అటు దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా లీడర్లతోనూ దగ్గరి సంబందాలున్న వ్యక్తిగా చంద్రస్వామి పేరుగాంచారు. ఆ గురువుగారు కొనిచ్చిన డ్రెస్ ధరించే ఏపీ సింగ్ లాయర్ గా తొలి కేసు వాదించారు. వివిధ కేసుల్లో చంద్రస్వామి దోషిగా నిర్దారణ అయి, 2017లో చనిపోయేదాకా ఆయనతో సింగ్ అనుబంధం కొనసాగింది.
ఇదిలా ఉండగా, బీజేపీకి చెందిన కీలక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందకు బెయిల్ ఇప్పించింది కూడా ఏపీ సింగే కావడం గమనార్హం. తన ఆశ్రమానికి చెందిన లా కాలేజీలో చదివే విద్యార్థినిపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో నిర్ధారణ అయింది. అయితే లైంగిక బంధం ద్వారా ఇద్దరూ ప్రయోజనాలు పొందారని, ఇందులో ఒకరిని మాత్రమే తప్పుపట్టాల్సిన అవసరం లేదన్న సింగ్ వాదనతో కోర్టు ఏకీభవించడం, ఆ వెంటనే బెయిల్ పై విడుదలైన చిన్మయానందకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలకడం తెలిసిందే.
తాను రాజ్‌పుత్ నని గర్వంగా చెప్పుకునే ఏపీ సింగ్.. మనిషికి పరువు కంటే మించింది ఏదీ లేదని అంటారు. సమాజంలో మహిళల పాత్రపైనా ఆయనకు తనవైన అభిప్రాయాలున్నాయి. దేశంలో ఆత్మహత్యకు పాల్పడేవాళ్లలో ఎక్కువ మంది మగాళ్లేనని, అందులోనూ మహిళల కారణంగా చనిపోతున్నవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన వాదిస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాదిరిగా మగవాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా వినిపిస్తున్నారు.