English | Telugu
ఇన్ సైడర్ ట్రేడింగ్ గుట్టు విప్పనున్న సి బి ఐ
Updated : Mar 23, 2020
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ప్రాంతం లో జరిగిన భూ అక్రమాల కేసును సి బి ఐ -సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలవంతపు భూ సేకరణ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ఇప్పటి వరకూ సి ఐ డి విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇక మీదట ఆ కేసును, సి బి ఐ విచారిస్తుందని హోమ్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ ప్రకటించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిషమెంట్ యాక్ట్, 1946 లోని సెక్షన్ 6 కింద ఈ కేసును, సి బి ఐ కు బదలాయిస్తున్నట్టు హోమ్ సెక్రెటరీ పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక లో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిన విషయం నిర్ధారణ కావటం వల్ల, అలాగే, ఇందులో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం లో ఉన్న మంత్రులు, అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా సబ్ కమిటీ నివేదిక ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తొలుత సి ఐ డి తో ఈ విచారణ ప్రారంభించింది. అయితే, ఈ రోజు తాజా ప్రకటన ద్వారా ఇక మీదట సి బి ఐ , ఇన్ సైడర్ల గుట్టు విప్పనుంది.
అమరావతిలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే . టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసినట్లు కమిటీ నిర్ధారించినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. . ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటపెట్టిన సబ్ కమిటీ... 4,075 ఎకరాల భూముల టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు తేల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్ భారీ భూ కొనుగోళ్ల వివరాలను కమిటీ తన నివేదికలో పొందు పర్చింది . అప్పటి మంత్రులు పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీ నేతల అమరావతిలో భూములు కొన్నట్టు నివేదికలో వెల్లడించింది. .
సీఆర్డీఏ పరిధిని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం పలుమార్లు మార్చినట్లు ఆధారాలు గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ... ఎస్సీ, ఎస్టీ నుంచి 900 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. తెల్ల రేషన్ కార్డుదారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారని... హైదరాబాద్ లోని తెల్లరేషన్ కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో వెల్లడించినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే దీనిపై సీబీఐ విచారణను కోరాలని ఏపీ ప్రభుత్వం లోగడే నిర్ణయించింది.