English | Telugu

కౌల‌లాంపూర్ నుంచి 200 మంది విద్యార్థులు బ‌య‌లుదేరినా ఇంకా 150 మంది ప‌డిగాపులు

కరోనా వైరస్‌ దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేయడంతో కౌలాలంపూర్‌ తెలుగు వారు చిక్కుకున్నారు. వీరిలో విద్యార్థులు, టూరిస్టులు వున్నారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో ఫొటోలు షేర్ చేశారు.

ఇండియ‌న్ హై క‌మీష‌న్‌కు వెళ్ళి త‌మ గోడు వినిపించినా అధికారుల నుంచి స్పంద‌న లేదంటున్న బాధితులు.

ఎలాగైనా త‌మ‌ను ఇండియాకు తీసుకు వెళ్లండి. తిన‌డానికి తెచ్చ‌కున్న ఆహార‌ప‌దార్థ‌ల‌న్నీ అయిపోయాయి. ప్ర‌భుత్వం వెంట‌నే జోక్యం చేసుకొని స్పెష‌ల్ విమానాలు ఏర్పాటు చేసి ఆదుకోవాల‌ని బాధితులు వేడుకుంటున్నారు.

మ‌రో ప‌క్క రెండు తెలుగురాష్ట్రాల్లో వున్న వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని బాధితుల బంధువులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. భారత్‌ నుంచి సమాచారం వస్తేనే పంపిస్తామని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇదిలా వుంటే మనీలా నుంచి వ‌చ్చి కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో చిక్కుకున్న మెడిక‌ల్ విద్యార్థులు సుమారు 200 మంది స్వ‌దేశానికి బ‌య‌ల్దేరారు.

కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయులు కౌలాలంపూర్‌తో పాటు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయాల్లో మంగళవారం పడిగాపులు కాశారు. చిక్కుకున్న వారిలో ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు.. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాలకు చేరుకున్న వారంతా అర్ధరాత్రి వరకు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది.
చివరికి కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ క్రమంలో తెలుగు విద్యార్థులు ఈ మధ్యాహ్నం ఎయిర్‌ ఏషియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.

అయితే మిగిలిపోయి మ‌రో 150 మంది ఇంకా కౌలాలంపూర్‌లో నే బిక్కుబిక్కు మంటూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని వారి బంధువులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.