English | Telugu

ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు వ‌చ్చాయ‌ట‌!

పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మూడు రాష్ట్రాలకు పట్టణ స్థానిక సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1600 కోట్లుకుపైగా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రూ. 431 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్ర ఖాతాలో జమ చేసినట్లుగా.. కేంద్రం సమాచారం పంపింది. అది విష‌యం.

మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావని వైసీపీ నేతలు ఆందోళన చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

నిజానికి మున్సిపల్ ఎన్నికలు ఏపీలో జరగలేదు. వాయిదా పడ్డాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ..దీన్నేమి పట్టించుకోకుండా.. కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తాజా వ‌చ్చిన ఈ 431 కోట్ల రూపాయ‌ల ఆర్థిక సంఘం నిధులను పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది.

ఇప్పుడు మున్సిపల్ కోటాకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.. త్వరలో మండల, పంచాయతీలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తార‌ట‌. మొత్తంగా ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా.. రూ. 3,500 కోట్ల నిధులు స్థానిక సంస్థలకు వస్తాయన్న అంచనా ఉంది.