English | Telugu

రాజమౌళి ఇప్పటి నుంచే మొదలెట్టేశాడా.. మహేష్‌తో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలిగా!

రాజమౌళి ఇప్పటి నుంచే మొదలెట్టేశాడా.. మహేష్‌తో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలిగా!

డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఒక సినిమా స్టార్ట్‌ చేశాడూ అంటే అది పూర్తయి రిలీజ్‌ అయ్యే వరకు దానిపైనే వర్క్‌ చేస్తాడు తప్ప మరో విషయం గురించి ఆలోచించరు. ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే దాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తారు.  ఎక్కడ చూసినా తమ సినిమా గురించే చర్చ జరగాలి అనే దానిపై దృష్టి పెడతారు. దానికి తగ్గట్టుగానే పథక రచన కూడా చేస్తాడు అనే మాట ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు 12 సినిమాలు డైరెక్ట్‌ చేసిన రాజమౌళి అతని ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని జనంలోకి ఇంజెక్ట్‌ చేస్తాడు. దాన్ని మీడియాలో, సోషల్‌ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అదే అతనికి కావాల్సింది కూడా. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల్ని ఎలర్ట్‌ చేసేందుకు అలాంటి జిమ్మిక్స్‌ చేస్తాడు. 

కానీ, ఇప్పుడు అతను చేస్తున్న 13వ సినిమాకి సంబంధించి ఓ కొత్త మార్గాన్ని అనుసరించ బోతున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరో పక్క రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది అనేది వాస్తవం కాదని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. షూటింగ్‌ ప్రారంభం కాని ఈ సినిమాకి అప్పుడే లీకుల బెడద పెరిగిపోయిందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సెట్‌లో స్టిల్స్‌ బయటికి వచ్చాయని, తాజాగా సినిమాలోని కీలక సన్నివేశం లీక్‌ అయిందని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను కూడా వైరల్‌ చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం టెస్ట్‌ షూట్‌ మాత్రమే నడుస్తోందని, అందులోని క్లిప్‌ మాత్రమే బయటికి వచ్చిందనేది తాజా సమాచారం. ఈమధ్యకాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు లీకుల బెడద బాగా పెరిగిపోవడంతో తన తాజా సినిమా విషయంలో రాజమౌళి చాలా కేర్‌ తీసుకుంటున్నారు. సెట్‌లోకి సెల్‌ ఫోన్లు అనుమతించడం లేదు. టెస్ట్‌ షూట్‌లో కూడా దాన్నే పాటిస్తున్నారని తెలుస్తోంది. అంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పటికీ ఒక క్లిప్‌ బయటికి రావడం అనేది సాధారణ విషయం కాదు. రాజమౌళి స్ట్రాటజీని బట్టి చూస్తే దాన్ని కావాలనే బయటికి వదిలినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సీన్‌ను చాలా దగ్గర నుంచే షూట్‌ చేసినట్టు అర్థమవుతోంది. టెస్ట్‌ షూట్‌ సీన్సే లీక్‌ అయితే రేపు రెగ్యులర్‌ షూటింగ్‌ జరిగే సమయంలో మరెన్ని క్లిప్స్‌ బయటికి వస్తాయనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. 

ఒక సినిమాకి సంబంధించి ఎన్ని లీకులు జరిగినా ఆ సినిమా ఫలితంపై వాటి ప్రభావం ఉండదని గతంలో కూడా రుజువైంది. ఈ విషయంలో అత్తారింటికి దారేది చిత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి దాదాపు 45 నిమిషాల నిడివి ఉన్న ఫుటేజ్‌ బయటికి వచ్చేసింది. అది కూడా ఫస్ట్‌హాఫ్‌కి సంబంధించింది. అది సోషల్‌ మీడియాలో, మీడియాలో విపరీతంగా సర్క్యులేట్‌ అయింది. కానీ, దాని వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగలేదు.. సరికదా ఒక చరిత్ర సృష్టించింది. పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లీకుల విషయంలో దర్శకనిర్మాతలు, హీరోలు.. ఎవరూ ఆందోళన చెందడం లేదనేది వాస్తవం. మీడియా, సోషల్‌ మీడియా మాత్రం దాన్ని కొండంతలు చేసి.. కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టుగా వైరల్‌ చేసేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే సినిమాను పైసా ఖర్చు లేకుండా ప్రమోట్‌ చేసేందుకు ఎస్‌ఎస్‌ఎంబి29 యూనిట్‌ ‘లీకులు’ అనే ఆయుధాన్ని వాడుతున్నట్టు కనిపిస్తోంది. మహేష్‌తో రాజమౌళి చేస్తున్న సినిమా సెట్స్‌కి ఇంకా వెళ్ళలేదు. కానీ, రాజమౌళి దాన్ని ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.