Read more!

English | Telugu

బాలీవుడ్ మాఫియా న‌న్ను చంపాల‌ని చూస్తోంది.. నాకు సాయం చేయండి!

 

బాలీవుడ్ న‌టి, 'వీర‌భ‌ద్ర‌'లో బాల‌కృష్ణ జోడీగా న‌టించిన త‌నుశ్రీ ద‌త్తా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది. త‌న‌ను బాలీవుడ్ మాఫియా, జాతి వ్య‌తిరేక నేర‌గాళ్లు క‌లిసి త‌న‌ను దారుణంగా వేధిస్తున్నార‌నీ, త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ ఆమె ఆ పోస్ట్‌లో ఆరోపించారు. తాను చావు నుంచి ఎలాగో త‌ప్పించుకున్నాన‌ని ఆమె తెలిపారు. "నన్ను చాలా దారుణంగా వేధిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా ఏదైనా చేయండి!!" అని ఆమె అర్థించారు.

"మొదట, గత ఏడాది నా బాలీవుడ్ పనిని నాశ‌నం చేశారు. తర్వాత నేను తాగే నీటిని మందులు, స్టెరాయిడ్స్‌తో క‌ల‌ప‌డానికి ఒక పనిమనిషిని పంపారు. ఇది అనేక‌ ర‌కాలుగా నేను తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావ‌డానికి కారణమైంది. ఆ తర్వాత మే నెల‌లో నేను ఉజ్జయినికి పారిపోయినప్పుడు నా వెహికిల్‌ బ్రేకులు రెండుసార్లు దెబ్బతిని, యాక్సిడెంట్ అయ్యింది. నేను చావు నుంచి ఎలాగో తప్పించుకున్నాను. సాధారణ జీవితం కొన‌సాగించ‌డానికీ, నా పనిని తిరిగి ప్రారంభించడానికి 40 రోజుల తర్వాత ముంబైకి తిరిగి వచ్చాను. ఇప్పుడు నేనున్న బిల్డింగ్‌లో నా ఫ్లాట్ వెలుపల ఇబ్బందిక‌ర‌మైన‌ విషయాలు జ‌రుగుతున్నాయి." అని ఆమె రాసుకొచ్చారు.

"నేను క‌చ్చితంగా ఆత్మహత్య చేసుకోను. నేను ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. ఇక్క‌డే ఉంటాను. నా పబ్లిక్ కెరీర్‌ను మునుపెన్నడూ లేనంతగా ఉన్నత శిఖరాలకు చేరుస్తాను!" అని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.

"బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ (ఇప్పటికీ దీని ప్రభావం ఉంది), దుర్మార్గపు జాతి-వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలా పనిచేస్తాయి. వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన #metoo దోషులు, ఎన్జీవో ఉన్నార‌నేది ఖాయం. వారు కాకుండా ఇంకెవ‌రు ఇలా న‌న్ను టార్గెట్ చేసి, వేధిస్తారు?" అని త‌నుశ్రీ ప్ర‌శ్నించారు.

"సిగ్గుపడండి! చాలా మంది నన్ను లేకుండా చేయ‌డానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు, కానీ నేను చాలా కాలంగా ఇన్‌స్టాలో అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తున్నాను. ఇది తీవ్రమైన మానసిక, శారీరక, మానసిక వేధింపు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్న చిన్న అబ్బాయిల‌ను, అమ్మాయిల‌ను వేధించి చంపే ఈ ప్ర‌దేశం ఎలాంటిది?" అని అడిగారు.

"మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, సైనిక పాలన ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి నియంత్రణను కలిగి ఉండాలి. ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు బాధలు పడుతున్నారు. ఇక్కడ తీవ్ర‌మైన మార్పులేవో జ‌ర‌గాలి. ఈరోజు నేను, రేపు నువ్వు కూడా కావచ్చు." అని ఆమె హెచ్చ‌రించారు.

"ఈ నగరంలో శాంతిభద్రతలు లేవు! ఒక‌ప్పుడిది కళాకారులకు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఎల్లప్పుడూ సురక్షితమైన స్వర్గధామంగా ఉండేది. హే కృష్ణా! అన్నయ్యా నాకు సహాయం చెయ్యండి." అని ఆమె అర్థించారు.