Read more!

English | Telugu

కారుతో భార్యను ఢీకొట్టి కెమెరాకు దొరికిపోయిన నిర్మాత

ఒక షాకింగ్ ఇన్సిడెంట్‌లో బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా కారుతో భార్యను ఢీకొట్టాడనే అభియోగం ఎదుర్కొంటున్నాడు. ముంబైలోని వెస్ట్ అంధేరిలోని ఒక నివాస భవనం పార్కింగ్ ఏరియా సీసీటీవీ ఫుటేజ్‌లోని విజువల్స్‌లో ఘటన జరిగిన సమయంలో కారును మిశ్రా నడుపుతున్నట్లు స్పష్టమైంది. అతను మరో స్త్రీతో కలిసి ఉన్నట్లు భార్య గుర్తించడమే దీనికి కారణమని వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ కేసును నమోదు చేశారు.

అక్టోబర్ 19న ఈ ఘటన జరిగినప్పుడు, మిశ్రా భార్య బయటకు వచ్చి తన భర్త కోసం వెతికింది. అంధేరి బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో అతను మరో స్త్రీతో కలిసి ఉన్నట్లు ఆమె గుర్తించిందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే, కారు కదిలి ఆమె వైపుకు వస్తున్నప్పుడు కారు విండోలో లోపలి నుంచి ఒక స్త్రీ కనిపిస్తోంది. 

కారు వేగం అందుకొని నిర్మాత భార్యను ఢీకొట్టిన తర్వాత ఆమె కిందపడి కారు చక్రాల దగ్గరకు రావడంతో సమీపంలో ఉన్న జనం ఆ కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కారు ఆమె మీద నుంచి వెళ్లడంతో ఒక వ్యక్తి ఆమెను బయటకు లాగాడు. సమయం వృథా చెయ్యకుండా ఆ కారు అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయింది. 20 నిమిషాల ఆ వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. పోలీసులు మిశ్రా కోసం గాలిస్తున్నారు. 

అనంతరం మిశ్రా భార్య అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఓక ఫిర్యాదు చేస్తూ, తన తల, కాళ్లు, చేతికి గాయాలయ్యాయని ఆరోపించింది. ఈమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 337 (ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే చర్యకు పాల్పడటం) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

కమల్ కిశోర్ మిశ్రా బాలీవుడ్‌లో 'ఫ్లాట్ నం. 420', 'భూతియప, 'దేహతి డిస్కో', 'ఖల్లీ బల్లీ' సినిమాలను ప్రోడ్యూస్ చేశాడు.