English | Telugu
బాలీవుడ్‌లో విషాదం.. అగ్ని ప్రమాదంలో బాలనటుడు, అతని సోదరుడు మృతి!
Updated : Sep 29, 2025
ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మరో బాలీవుడ్ నటుడు అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. హిందీలో ‘శ్రీమద్ రామాయణ్’, ‘వీర్ హనుమాన్’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించిన వీర్‌శర్మ(10) ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో అతని అన్నయ్య శౌర్యశర్మ(15) కూడా చనిపోవడం మరింత విచారకరం.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కోట అనంతపురలోని దీప్‌శ్రీ భవనంలో నివాసం ఉంటోంది వీర్ కుటుంబం. వీర్, శౌర్యల తల్లి రీటాశర్మ సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తుంటారు. తండ్రి ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తల్లి వేరే గదిలో ఉన్నారు. తండ్రి బయటికి వెళ్లారు. వీర్‌శర్మ, శౌర్యశర్మ తమ గదిలో నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది. అన్నదమ్ములిద్దరూ పడుకున్న రూమ్‌తోపాటు హాల్‌ను కూడా పొగ కమ్మేసింది. గాఢ నిద్రలో ఉన్న వీరిద్దరూ ఆ పొగను బాగా పీల్చడం వల్ల నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
అపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆ అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నారు. లోపల ఉన్నవారిని రక్షించేందుకు తలుపులు పగలగొట్టి ఇద్దరు పిల్లలను బయటికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దర్నీ వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అయితే అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయారని డాక్టర్లు కన్‌ఫర్మ్ చేశారు. పిల్లలిద్దరూ ఒకేసారి చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. వీర్‌శర్మ, శౌర్యశర్మ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పిల్లల్ని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ వారి కళ్లను దానం చేసేందుకు ఆ తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. వారి మంచితనాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
10 ఏళ్ళ వీర్‌శర్మ ‘వీర హనుమాన్’ సీరియల్‌లో లక్ష్మణుడిగా, ‘శ్రీమద్ రామాయణ్ సీరియల్‌లో ఓ కీలక పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సైఫ్‌అలీ ఖాన్ నటించే ఓ సినిమాలో అతని చిన్ననాటి పాత్ర పోషిస్తున్నాడు. సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా వీర్‌శర్మ నటుడిగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది.