English | Telugu
రోడ్డు విస్తరణ కోసం అమితాబ్ బిల్డింగ్‌లో కొంత భాగాన్ని కూల్చబోతున్న బీఎంసీ!
Updated : Jul 4, 2021
రోడ్డు విస్తరణలో భాగంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు చెందిన ముంబైలోని 'ప్రతీక్ష బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చేందుకు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు. నిజానికి దీనికి సంబంధించి 2017లోనే నోటీసు ఇచ్చినప్పటికీ, ఇంతవరకూ ఆ బంగ్లాను ముట్టుకోలేదు అధికారులు. సంత్ ధ్యానేశ్వర్ మార్గ్ రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా ప్రతీక్ష బంగ్లాలోని కొంత భాగాన్ని తాము స్వాధీనం చేసుకోబోతున్నట్లు అప్పుడు బీఎంసీ నోటీసు జారీచేసింది. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ఆ బంగ్లాకు సంబంధించి కచ్చితంగా ఎంతమేర అవసరమవుతుందో మార్కింగ్ చేయాల్సిందిగా ముంబై సబర్బన్ కలెక్టర్ సిటీ సర్వే అధికారులకు బీఎంసీ సూచించింది. చందన్ సినిమా ఏరియా నుంచి లింక్ రోడ్డుకు ఇస్కాక్ టెంపుల్ వైపు సంత్ ధ్యానేశ్వర్ మార్గ్ కనెక్ట్ అవుతుంది.
ఆ రోడ్డు విస్తరణ పనుల కోసం మిగతా అన్ని ఇళ్లల్లో కొంత భాగాల్ని ఇప్పటికే స్వాధీనం చేసుకొని, పనులు చేపట్టిన బీఎంసీ, ఒక్క అమితాబ్ ఇంటిని మాత్రం ఇప్పటిదాకా ఎందుకు తాకలేదని మునిసిపల్ కౌన్సిలర్ కూడా అయిన అడ్వకేట్ తులిప్ బ్రియాన్ మిరాండా ప్రశ్నించారు. బచ్చన్ బంగ్లాకు ఆనుకొని ఉన్న గోడను కూడా కూలగొట్టి డ్రైనేజ్ నిర్మించారనీ, కానీ బచ్చన్ ఇంటిని మాత్రం బీఎంసీ అధికారులు తాకలేదనీ ఆమె విమర్శించారు. "నోటీస్ ఇచ్చిన 2017లోనే ఆ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అదే స్థలం ఒక కామన్‌మ్యాన్‌దే అయితే మునిసిపాలిటీ చట్టంలోని సెక్షన్ 299 ప్రకారం ఎప్పుడో తీసేసుకునేవాళ్లు." అని ఆమె అన్నారు.
అక్కడ రోడ్డు విస్తరణ పనులు అత్యంత ఆవశ్యకమనీ, ఆ ప్రాతంలో రెండు స్కూళ్లు, ఒక హాస్పిటల్, ఒక ఇస్కాన్ టెంపుల్, ముంబైకి చెందిన పురావస్తువులు కొన్ని ఉన్నాయనీ, కానీ అక్కడ అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఇల్లు ఉండేటప్పటికి ఆ పనులను హఠాత్తుగా ఆపేశారనీ ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను బీఎంసీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖ రాశాననీ, రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయకపోతే, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని అందులో హెచ్చరించాననీ ఆమె వెల్లడించారు. ఇప్పుడు అధికారుల్లో కదలిక రావడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
