Read more!

English | Telugu

గుడిలోకి వెళ్ల‌కుండా ర‌ణ‌బీర్‌, ఆలియాను ఆపేసిన భ‌జ‌రంగ్ ద‌ళ్ స‌భ్యులు

 

మ‌రో రెండు రోజుల్లో 'బ్ర‌హ్మాస్త్ర' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల కాబోతోంది. త‌మ మూవీని ప్ర‌మోట్ చేయ‌డానికి ఆలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ డైరెక్ట‌ర్ అయ‌న్ ముఖ‌ర్జీ, నిర్మాత‌లు ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌దులుకోవ‌ట్లేదు. తెలుగు వెర్ష‌న్‌ను య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాల్సిందిగా సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ఆశావ‌హంగా క‌నిపిస్తున్నాయ్‌. 

ఈ నేప‌థ్యంలో ర‌ణ‌బీర్‌, ఆలియా, అయ‌న్‌.. ముగ్గురూ ఉజ్జ‌యిని లోని మ‌హాకాళి గుడిని సంద‌ర్శించుకోగా, వారిని గుడిలోకి వెళ్ల‌కుండా భ‌జ‌రంగ్ ద‌ళ్ స‌భ్యులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు చెద‌ర‌గొడుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మాహాకాళేశ్వ‌ర్ టెంపుల్‌ని కొంత‌మంది వీఐపీలు సంద‌ర్శించ‌డానికి వీలుగా మేం ఏర్పాట్లు చేశాం. ఆ టైమ్‌లో కొంత‌మంది వారికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లను చేప‌ట్ట‌డానికి గుమికూడారు. నిర‌స‌న‌కారుల్లో ఒక‌త‌ను పోలీసాఫీస‌ర్ల‌తో ఫైటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు అని ఉజ్జ‌యిని సీఎస్పీ ప్ర‌కాశ్ మిశ్రా తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్ర‌భుత్వ సిబ్బంది విధుల‌కు ఆటంకం క‌లిగించినందుకు ఐపీసీ 353 ప్ర‌కారం నిర‌స‌న‌కారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఒక వీడియోలో, తాము ర‌ణ‌బీర్ బృందాన్ని గుడిలోకి అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని ఓ భ‌జ‌రంగ్ ద‌ళ్ స‌భ్యుడు చెప్పాడు. "మేం ర‌ణ‌బీర్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్నాం. అత‌డిని మ‌హాకాళ్ గుడిలోకి అడుగుపెట్ట‌నివ్వం. మా గోమాత‌కు వ్య‌తిరేకంగా అత‌ను మాట్లాడాడు. బీఫ్‌ను తిన‌డం మంచిద‌ని అత‌న‌న్నాడు" అని చెప్పాడు ఆ స‌భ్యుడు.

2011లో 'రాక్‌స్టార్' మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ర‌ణ‌బీర్ ఆ మాట‌లు అన్నాడు. తన‌కు బీఫ్ అంటే ఇష్ట‌మ‌ని ర‌ణ‌బీర్ చెప్పిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌లామ‌ణీ అవుతోంది. "మా ఫ్యామిలీ పెషావ‌ర్ నుంచి వ‌చ్చింది. కాబ‌ట్టి వారితో పాటు పెషావ‌రీ ఫుడ్ కూడా వ‌చ్చింది. నేను మ‌ట‌న్‌, పాయ‌, బీఫ్ ఫ్యాన్‌ను. నేను బీఫ్‌కు పెద్ద ఫ్యాన్‌ని" అని చెప్పాడు ర‌ణ‌బీర్‌.