Home » Specials » జయహో..భారతమాత ముద్దుబిడ్డలారా

జయహో..భారతమాత ముద్దుబిడ్డలారా

 

.......రమ

 

 

ఈ రోజు మరోసారి మనం సగర్వంగా మన జాతీయ జెండా రెపరెపలని వీక్షించే రోజు ... జైహింద్ అంటూ భారతీయతని మనసునిండా నింపుకునే రోజు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేశారు, ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదిలారని మనం చిన్నప్పటినుంచి విన్నాం, చదువుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఆ మాటల్ని మననం చేసుకోవటంలో ఉద్దేశ్యం ఒక్కటే - వారి ఆ త్యాగాలు, వారిలోని ఆ చైతన్యం, దేశభక్తి మనలో స్ఫూర్తిని నింపాలనే - మన సమాజంకోసం, మన దేశం కోసం మనం ఆలోచించటం మొదలు పెట్టాలనే. అలా మనలో స్ఫూర్తిని నింపే వ్యక్తులు ఇప్పటికీ మన చుట్టూ ఎందరో వున్నారు. నిశ్శబ్దంగా వారి పరిథిలో వారు చేయగలిగింది చేసుకు వెళ్ళిపోతున్నారు.

 

స్వాతంత్ర్యపు గాలులు మనలో ఆత్మవిశ్వాసాన్ని, నిబ్బరంగా నిలబడే ధైర్యాన్ని అందించినట్టే ... మన దేశం కోసం మనం ఆలోచించేలా చేయాలి. రెపరెపలాడే జాతీయ జెండాకి సెల్యూట్ చేసి ... దానివైపు ఆనందంగా చూపు సారించే క్షణంలో ... మనసులో ఒకసారి ... ఈ దేశం కోసం కృషి చేసిన, చేస్తున్న ప్రతీ ఒక్కరిని తలుచుకుంటూ వారందరికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎవరో ఒకరు ... ముందడుగులు వేస్తేనే ... ఓ మార్పు సాధ్యం ... అలా మార్పుకు నాంది పలికిన వారెందరో....వారిలో కొందరినైనా తలచుకుందాం.


1. ''జో మేడియత్'' గ్రామ వికాస్


 

 

 

గాంధీగారు కలలుకన్న గ్రామాభ్యుదయాన్ని నిజం చేసి చూపించారు ... 'జో మేడియత్''
ఒరిస్సా రాష్ట్రంలోని గిరిజనుల కోసం అక్కడి నాయకులు, అధికారుల్ని మించి పాటు పడుతున్న వ్యక్తి ఆయన. అది ఆయన ఊరు కాదు, ఆయన రాష్ట్రం కూడా కాదు. ఎక్కడో కేరళలో పుట్టిపెరిగిన 'జో మేడియత్' ఒరిస్సాలోని పేదప్రజల దయనీయస్థితిని గమనించి అక్కడ 'గ్రామ వికాస్'ను ప్రారంభించారు. గ్రామస్తులంతా కలిసి సంఘంగా ఏర్పడి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తారు. అటవీ ఉత్పత్తుల నుంచి హైటెక్ చదువుల వైపు ఆ గిరిజనులని నడిపించిన మేడియత్ "మాకు కనిపించే దేవుడు'' అని చెబుతారు అక్కడివారంతా.


2.  నాగ చంద్రిక ... ఎందరికో అమ్మ ...

 

 

పసిపిల్లలకే అమ్మ అవసరం అనుకుంటాం కాని అంతకుమించి అవసరం వయసుమళ్ళిన పెద్దలకే వుంటుంది అంటారు నాగ చంద్రిక. అందుకే అలా వయసు మళ్ళి తన వారు లేక అనాధలైన వృద్ధులకి అమ్మగా మారారు. సాధారణ గృహిణిగా తన ఇంట్లోనే మొదట ఓ నలుగురు వృద్ధులకి ఆశ్రయం ఇచ్చారు. ఆ తర్వాత "ప్రేమ నిలయం'' ఏర్పాటు .. సుమారు ఆరేడు వందల మందికి పైగా వృద్ధులకు ఆశ్రయం ఇవి చంద్రిక గురించిన పరిచయ వాక్యాలు .. "ఎవరైనా కదలలేని స్థితిలో రోడ్లమీద కనిపిస్తే చూసీ చూడనట్టు వదిలెయ్యకండి ... దయచేసి మాకు ఒక్క ఫోన్ చేయండి చాలు'' అంటారు చంద్రిక. ఇది కాదా... సమాజం కోసం ఆలోచించటమంటే ... ఇది కాదా దేశభక్తి అంటే ...

 

౩. వార్తలతో చైతన్యం

 

 

ఉత్తరప్రదేశ్ లోని సుమారు నాలుగొందల గ్రామాల్లోని ప్రజలకు అక్షర జ్ఞానం అందించటమే కాదు ... వారిని చైతన్య వంతుల్ని చేస్తోంది 'ఖబర్ లహరియా'..... సాధారణ వార్తాపత్రికే కదా .. ఏంటి ప్రత్యేకత అంటారా? ఎంతో వెనకబడ్డ ప్రాంతలో, కనీస వసతులు, సౌకర్యాలు లేని చోట, నిరక్షరాస్యత, ముఖ్యంగా పురుషాధిక్యత ఎక్కువగా కలిగిన ప్రాంతంలో కొంతమంది మహిళలు కలిసి ఈ పత్రిక డిజైనింగ్, ప్రింటింగ్, మార్కెటింగ్ ... అంతా వారి చేతుల మీదుగానే జరుగుతుంది. వీరు పెద్దగా చదువుకోలేదు. కాని పత్రికలో చేరాక హిందీ, ఇంగ్లీషు భాషల్లో శిక్షణ తీసుకున్నారు. ఓ స్వచ్చంధ సంస్థ ప్రోత్సాహంతో తమ జీవితాలలో, తమవారి జీవితాలలో మార్పు కోసం నడుంకట్టారు ఈ మహిళలు. ...

 

 

 

 

గ్రామాల్లో తిరిగి వార్తా సేకరణ, ప్రభుత్వ అధికారులతో ఇంటర్వ్యూలు ... మూఢాచారాలని నిరసిస్తూ వ్యాసాలూ ... పనిచేయని నాయకుల తీరుని ఎండగట్టడం .. ఒకటా రెండా .. సాధారణ వార్తాపత్రికకి దీటుగా ''ఖబర్ లహరియా''ని తీర్చిదిద్దుతున్నారు. యునెస్కో అవార్డు సైతం వరించింది. ఎవరికోసమో ఎదురు చూడలేదు. పరిస్థితులని నిందించలేదు, చైతన్యం పొందారు, చైతన్యవంతులని చేస్తున్నారు. నిరక్షరాస్యులు ... మారుమూల గ్రామం ... ఏ వసతులూ లేవు .. ప్రభుత్వ అండలేదు అయితేనేం సంకల్పం వుంది ... ఇది నా దేశం ... వీళ్ళంతా నా వాళ్ళు అనే భావం వుంది ... "ఖబర్ లహరియా'' మహిళా శక్తికి, దేశభక్తికి చిరునామా అని చెప్పచ్చు ...

 

4.  స్త్రీ చైతన్యానికి చిరునామా గులాబీ గ్యాంగ్

స్త్రీ చైతన్యం గురించి మాట్లాడుకుంటూ గులాబీగ్యాంగ్ గురించి చెప్పకపోతే ఎలా ... ఉత్తరప్రదేశ్ లోని బందాలోని 'గులాబీగ్యాంగ్''లో సభ్యులందరూ స్త్రీలే ... అందరూ గులాబి రంగు చీరలే కట్టుకుంటారు ... ఎప్పుడూ. వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే "స్త్రీని నిర్లక్ష్యం చేసే సామాజిక రుగ్మతల మీద, అవనీతి మీద, వాటి నిర్మూలన కోసం పోరాటం సాగిస్తారు.

 



 

భారతదేశంలో ఉన్నా అతి నిరుపేద జిల్లాలో 'బందా' కూడా ఒకటి. స్త్రీ వివక్షత, వరకట్న వేధింపులు, కుటుంబ హింస సర్వసాధారణం. వీటికి ఎందరో మహిళల ప్రాణాలు పోతున్నాయి కూడా...ఇలాంటి పరిస్థితులని చూసి అనుభవించి, వీటి నుంచి స్త్రీలకి విముక్తి కలిగించాలని స్త్రీల హక్కులు సమానత్వం వంటి వాటిపై ఈ గులాబీ గ్యాంగ్ ద్వారా పోరాటాన్ని సంధి౦చింది సంపత్ పాల్ దేవి.

తను సాధించిన విజయం ఎంతటిదంటే కొన్నేళ్ళ క్రితం ఫ్రాన్స్ లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడటానికి తనకి ఆహ్వానం అందింది. వివిధ దేశాల నుంచి 150మంది ప్రసిద్ద మహిళా వక్తలు హాజరైన ఈ సదస్సులో తన అభిప్రాయాలని వినిపించి ఒకసారిగా ప్రపంచవ్యాప్తంగా గులాబీ గ్యాంగ్ కి ప్రత్యేక గుర్తింపుని సంపాదించి పెట్టారు.

 

 



 

తన జీవితం తనది అనుకోలేదు..తన ఇంట్లో తను సుఖంగా వుంటే చాలనుకోలేదు...జయహో వీరులారా...సమాజంలో రుగ్మతలపై యుద్ధం చేసే మీరంతా మాకు స్పూర్తి..అని మనస్పూర్తిగా వీరిని అభినందించాలని అనిపించటం లేదు.


5. ఇక రజియా సుల్తానా గురించి చెప్పి తీరాలి.

 

 

మీరట్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పనికి వెళితే కాని పూటగడవని కుటుంబం. చదువుకోసం ఓ పోరాటమే చేసింది. తను హైస్కూల్ కి వచ్చాకా గ్రామంలోని మిగితా పిల్లలని ప్రోత్సహించింది. గ్రామమంతా ఆమెపై కక్ష కట్టింది. కాని అదరలేదు. బెదరలేదు. ఓ స్వచ్చంద సంస్థ సాయంతో "బాల పంచాయితీని" ఏర్పాటు చేసింది. దానికి నాయకురాలిగా ఉండే పిల్లల్ని బడికి పంపాల్సిందేనని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి, ఒక్కొక్కరినీ బడిలో చేర్పించింది. అంతేనా? గ్రామానికి మంచినీటి, వసతి వంటి వాటికోసం అధికారులతో పోరాటం సాగించింది. ఇలా చదువుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు "బాల పంచాయితీ" లోని పిల్లలంతా. వారందరిలో మార్పుకి శ్రీకారం చుట్టిన రజియాకి క్రితం సంవత్సరం "మలాలా' అవార్డునిచ్చి సత్కరించింది ఐక్యరాజ్యసమితి.

 

 



ఇలా చెబుతూ వెళితే ఎందరో.. ఎందరెందరో... నిశబ్దంగా... నిజాయితీగా సమాజం కోసం పాటుపడుతూ... తాము నడుస్తూ మరెందరినో నడిపిస్తూ ఉజ్వల భారత భవిష్యత్తుకి పునాదులు వేస్తూ మనకి కనిపిస్తారు. వీరంతా కూడా వీరులే... సామాజిక రుగ్మతలతో పోరాడే యోధులే.. దేశ భక్తులే. అందుకే వారందరికి సెల్యూట్ చేద్దాం. భారత ఘనకీర్తిని.. ఉజ్వలింపచేయటానికి కృషి చేసే వారందరికి సలామే చేద్దాం.

ఆ స్ఫూర్తితో మనమూ ఓ చిన్న ప్రయత్నం చేద్దాం... ముందడుగు వేద్దాం.

జయహో... భారతావని

జయహో..భారతమాత ముద్దుబిడ్డలారా..

జయహో...జయహో...జయహో...జయహో...