Home » Articles » కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి ఇలా

 

కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి ఇలా
 
 
కొత్త సంవత్సరం సరికొత్తగా మారాలంటే ఆ మ్యాజిక్ స్టిక్ మీ చేతుల్లోనే ఉంది. కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు. ఎలా అంటే.
 
1. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని...
 
మనల్ని మనం something special అనుకోవాలి. అప్పుడే ప్రపంచాన్ని ఒప్పించగలం. ఎప్పుడూ.. అందరికంటే ఎందులో
 తక్కువ అన్నది ఆలోచిస్తూ... మనకే ప్రత్యేకమైన ఎన్నిటినో మనం గుర్తించం. ఈరోజు నుంచి సరికొత్తగా ఆలోచించటం మొదలుపెట్టండి.
 
మీ best qualities list రాసెయ్యండి. ఇక అప్పుడు... "తల ఎగరేసి.. అంతెత్తున నిలబడి, అకాశాన్న పూసే నక్షత్రాలని
 కోసుకురానా".. అని అడిగేంత ఆత్మవిశ్వాసం మీ స్వంతం కాకపోతే అడగండి.
 
2. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురోయ్...
 
నలుగురికి నచ్చేట్టు బతకాలని ప్రయత్నిస్తూ, మనకి నచ్చినట్టు మనం బతకటం మర్చిపోతాం. నలుగురికోసం బతకాలని కానీ
నలుగురిలో ఒకరిగా కాదు. అలా కాకూడదంటే మనం మన మనసు మాట వినటం మొదలు పెట్టాలి. వాళ్ళకోసం, వీళ్ళకోసం అంటూ
కాక మన మనసుకు నచ్చినట్టు చేయటానికి ప్రయత్నించాలి. మొదట్లో నొసలు ముడుస్తారు. ఇదేంటని అడుగుతారు. అదరక, బెదరక
నిలబడితే కొన్నాళ్ళకి అలవాటు పడతారు.
 
ఇకప్పుడు... మన కలల్ని నిజాలుగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది.అప్పటి వరకు తెగిన గాలిపటాలుగా..గాల్లో తిరిగిన మన కలలు..ఎంచక్కా మన చేతిలో ఇమిడి, ఆకాశంలో అంత ఎత్తున ఎగరట మొదలు పెడతాయి. మరి ఈ రోజునుంచి వినటం మొదలు పెడతారా మీ మనసు మాటని.
 
3. నేస్తమా.. నేస్తమా... నువ్వే కోయిలై వాలతానంటే....
 
చిన్న పిల్లలుగా మారి అల్లరి చేయలన్నా, ఆనందించాలన్నా అది ఒక్క స్నేహితుల దగ్గరే. అందుకే మంచి ఫ్రెండ్స్ ని, మనసుకి దగ్గరగా
 ఉండే వారిని దూరం కానీయకండి. ఎప్పుడో ఒకప్పుడు కాకపోయిన అప్పుడప్పుడూ కలుస్తూ ఉండండి. కబుర్లు చెప్పండి. బేషజాలకు
పోకుండా మీకు మీరుగా ఉండండి. అచ్చంగా చిన్నప్పటిలా, పసిపాపల్లా అల్లరి చేసి ఆనందించండి. ఈ చిట్కా పాటిస్తే చాలు. మనసు
దూదిపింజలా మారి జీవితం మన ఎదుట నిలబెట్టే ఎన్నో సవాళ్ళను సులువుగా దాటేసే చురుకుదనం మన స్వంతం అయిపోతుంది.
 
 
4. జీవితం ప్రతిపదం సమరమైసాగనీ... గెలుపు నీదే సుమా...
 
చాలెంజ్ మనల్ని రారమ్మని పిలుస్తుంటే ఓడిపోతామేమోనని భయపడి ఆగిపోతే ఎలా..? ఏమి తెలియని వయస్సులోనే అడుగులు
వేయటానికి భయపడకుండా నడక నేర్చుకున్నాం. ఇక ఇప్పుడు భయం ఎందుకు? పడితే లేవగలమన్న నమ్మకం ఉంటే చాలు.
ప్రయత్నిద్దాం... గెలిస్తే సంబరాలు చేసుకుందాం. ఓడిపోతే లోపాలు ఎక్కడున్నాయో సరి చూసుకుని మళ్ళీ ప్రయత్నిద్దాం. "నా వల్ల
కాదు" అన్న మాటని మన డిక్షనరీలో నుంచి తీసేద్దాం. లక్ష్యాన్ని సాధించేందుకు చేసే ప్రయాణాన్ని ఇష్టంగా సాగిద్దాం. ఇకప్పుడు ఏది
కష్టం అనిపించదు. గుండెల్లోని తపన కళ్ళల్లోని కలలతో జతకడితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా..? నేను చెప్పటం
ఎందుకు? ఈ సంవత్సరం మీరు రుచి చూస్తారని నాకు తెలుసు.
 
5. జగమే మారినది మధురంగా ఈ వేళ...
 
ఈ మాట ప్రతిపూట మీనోట పలకాలి. అలా పలకాలంటే ఏం చేయాలో మీకు తెలిసిపోయిందిగా. మరింకెందుకు ఆలస్యం. మధురమైన
రోజులని మధురంగా ఆహ్వానించండి. గుండె నిండా ఆశలు నింపుకోండి. ఆ ఆశలకి ఆశయాలు తోడైతే... ఇక చూడండి. వారెవ్వా..
జీవితం అంటే ఇదే అనిపించకమానదు. నలుగురు మనల్ని చూసి.. బతకడమంటే ఇది అని అనుకోవాలి. నేర్చుకోవాలి. మనల్ని
అనుసరించాలి. వాళ్ళ జీవితాల్లో ఆనందాలని నింపుకోవాలి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.
ఈ నూతన సంవత్సరంలో మీ జీవితం మధురంగా సాగిపోవాలని కోరుకుంటూ మీకు మీరే శుభాకాంక్షలు అందించుకోండి.
  

 ---- రమ