Home » Holi Special » రంగుల హోళీ...ఆనంద కేళీ

 

రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం

 

ప్రకృతి ఇంత అందంగా ఉండటానికి కారణం ఇన్ని రంగులే. ఆ రంగులే లేకపోతే, ప్రకృతి కాంతకు ఇన్ని హంగులు ఉండేవి కాదు. ఇంత ఆకర్షణ వుండేది కాదు.

 

- బుగ్గలు ఎర్రబడితేనే ... ఆడపిల్ల ముఖంలో సిగ్గు తెలుస్తుంది.
- కాలు ఎర్రజీర పులుమున్కుంటేనే ... నాన్న ముఖంలో కోపం అర్థమవుతుంది.
- ముఖం నల్లబడితేనే ... రాజకీయ నాయకుడిలో ఓటమి కనిపిస్తుంది.

 

ఇలా మన జీవితంలో పెనవేసుకున్న "రంగులతోనే'' పండగ అంటే ... ఇక ఆ ఆనందానికి అవధులు, హద్దులు వుంటాయా? అందుకే "హోళీ'' పండుగకు ఇంత ప్రత్యేకత. వయసుతో సంబంధం లేకుండా, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ఆకర్షించే ఈ పండుగకు అసలు పేరు "హోళీకా పూర్ణిమ''

వైదిక సంప్రదాయంతో "పూర్ణిమ''కు ఒక ప్రత్యేక స్థానం వుంది.
 


 
- చైత్ర పూర్ణిమ: జగజ్జనని పండుగ - ప్రతిపన్యూఖ్యరాకాంత అయిన ఆ తల్లిని తిథి మండల పూజతో ఆరాధించాలి.

- వైశాఖ పూర్ణిమ: వ్యాసజయంతి, గౌతమబుద్ధుడు జన్మించినది, ఆయనకు జ్ఞానోదయం కలిగినది, ఆయన నిర్యాణం చెందినది వైశాఖ పూర్ణిమనాడే.

- జ్యేష్ఠ పూర్ణిమ: ఏరువాక పూర్ణిమ. ఈరోజునే సావిత్రీదేవి యమున్ని ప్రార్థించి, తన భర్త ప్రాణాలు తిరిగి పొందింది.

- ఆషాడ పూర్ణిమ: గురుపూర్ణిమ

- శ్రావణ పూర్ణిమ: రక్షాబంధనం - రాఖీ పండుగ

- భాద్ర పూర్ణిమ: అనంతపద్మనాభ పూర్ణిమ

- ఆశ్వీయుజ పూర్ణిమ: అమ్మవారి పండుగ - దీని గురించి ఎంత చెప్పినా తక్కువే

- కార్తీక పూర్ణిమ: జ్వాలా తోరణం - వ్యషోత్సర్జనం - ఆబోతులకు అచ్చువేసి వదలడం

- మార్గశీర్ష పూర్ణిమ: దత్తాత్రేయ జయంతి

- పుష్య పూర్ణిమ: పూషాదేవిని ఆరాధించే పండుగ

- మాఘ పూర్ణిమ: సూయుని పండుగ అయినా - పూర్ణిమ కారణంగా చంద్రుని పండుగ కూడా

- ఫాల్గుణ పూర్ణిమ: హోళీకా పూర్ణిమ. హోళీ పండుగ.

 

 

చంద్రమాన సంవత్సరం చివర వచ్చే పూర్ణిమ ఇది. అందుకే ఈ పూర్ణిమను వీడ్కోలు పూర్ణిమ అన్నారు. సంవత్సరం పొడుగునా మానవాళి అనుభవించే కష్టసుఖాలు, సంతోష విషాదాలు, కలహాలు, వివాదాలు అన్నీ మర్చిపోయి ఈ పండుగతో ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే, మన ఋషులు ఈ పండుగను చివరి పండుగగా ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాన్ని స్వాగతించే పండుగ ఈ హోళీ పండుగ.

నిజానికి ఈ హోళీకా పూర్ణిమ పండుగ ఒక విశేషశక్తితో కూడి ఉంటుంది. ఈ పండుగ దినాన్న రాక్షస పీడా పోయేందుకు "హోళీకా'' శక్తిని ఆరాధించడం ఆచారం. ఈ పండుగ ఒకరోజు పండుగ కాదు. మూడురోజుల పండుగ. పూర్ణిమకు ముందురోజు "కామదహనం'' ఈ రోజునే శంకరుడు మన్మథుని దహించాడు. అందుకనే ఈ పండుగను ఈరోజునుంచే ప్రారంభించి, పౌర్ణమి మరునాడు వరకు చేస్తారు. ధర్మసింధు ప్రకారం ఫాల్గుణశుద్ధ పంచమి మొదలుకొని పూర్ణిమ వరకు ఆచరిస్తారని శాస్త్రవిధి. ఈ పడి దినములు ఉత్సాహవంతులైన పౌరులు దొరికిన యిళ్ళలో కర్రలు దొంగిలించి, పూర్ణిమ రాగానే ఆ కర్రలన్నీ ఒకరాశిగా వేసి, ఛండాల వాటికతో సూచికా గృహాలలా వున్న అగ్నిని ఒక చిన్నపిల్లవాడితో తెప్పించి, మంగళ వాద్యములతో ఆ కర్రలను అగ్నికి ఆహుతి చేస్తారు. దీనినే "హోళీకాగ్ని'' అంటారు.


పూర్వకాలంలో "ధుండీ'' అనే రాక్షసిని, అమ్మవారు హోళీకాశక్తి రూపుదాల్చి, సంహరించిందని, ఆ "ధుండీ'' రాక్షసి ప్రీత్యర్థమె 'ఈ హోళీకా చితిని' రగిలిస్తారని, ప్రాచీన కథనం. ఈ హోళీకా చితిలో పాలు, నెయ్యి, కొబ్బరికాయలు, దానిమ్మపళ్ళు వేస్తూ నృత్య, గీత, వాద్యాలతో ఆ రాత్రి అందరూ జాగురణ వుంటారు. అంతేకాదు ఆ జాగరణ చేస్తున్నంతసేపూ ప్రజలందరూ నానావిధమైన తిట్లు తిట్టుకుంటూ, ఆ హోళీకాగ్నికి మూడు ప్రదక్షిరామాలు చేస్తారు. అట్టి బూతుమాటల చేతనే ఆ దేవత తృప్తి చెందుతుందని జనుల విశ్వాసం. ఈ విధంగా ఆ రాత్రి 'హోళీకోత్సవం' చేసి, ప్రాతఃకాలమునందు ఛండాలుని సృష్టించి, తలస్నానం చేయాలి. పూర్ణిమనాడు ఉదయం హోళీకాదేవిని, షోడచోపచారాలతో పూజచేసి, బంధుమిత్రులతో కలిసి, విందువినోదాలతో ఆనందించాలి.

 

 

 

ఈ హోళీ పండుగనాడే దంపతులు సరిగంగ స్నానాలు చేసి, ఏకాంత ప్రదేశాలలో కూర్చుని, గతంలో జరిగిన చెడు అనుభావాలను మరిచిపోయి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ మన్మథ సంభాషణలతో, శృంగార మకరందాన్ని ఆస్వాదించాలని వాత్సాయనుడు చెప్తాడు. ఈ ఫాల్గుణపూర్ణిమనాడే శ్రీమహాలక్ష్మీ, క్షీరసాగారం నుంచి ఆవిర్భవించిందని, శ్రీమహావిష్ణువుని వివాహం చేసుకున్నద పురాణం కథనం. కనుక ఈ హోళీపండుగ నాడు మహాలక్ష్మీని భక్తిశ్రద్ధలతో, షోడచోపచారాలతో ఆరాధించాలి, కనకధారాస్తవాన్ని పారాయణ చేస్తే సమస్త ఇష్వర్యాలు కలుగుతాయి. మణికంఠ స్వామి అయిన అయ్యప్పస్వామి కూడా ఈ రోజునే ఉదయించాడని, కేరళీయుల విశ్వాసం. అందుకే ఈ రోజున అయ్యప్ప ఆరాధనలను జరుపుతారు.

యశోదాదేవి బాలకృష్ణుని, ఈ హోళీకా పూర్ణిమనాడే ఉయ్యాలలో వేసి, "డోలోత్సవం'' చేసిందని పురాణ కథనం. అందుకే ఈ రోజున ఉత్తరభారతీయులు డోలోత్సవాన్ని విధిగా జరుపుతారు. ఉయ్యాలలో శయనించిన బాలకృష్ణుని ఈ రోజున దర్శించిన వారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర ప్రవచనం.

 

వసంతోత్సవం :

ఈ పండుగ ఫాల్గుణ కృష్ణ పాడ్యమి నాడు వస్తుంది. అనగా హోళీకాపూర్ణిమ అయిన మరునాడు. ఈ రోజునే వివిధ రంగులపొడులను, రంగులుకలిపినా నీళ్ళను జనులు ఒకరిమీద ఒకరు జల్లుకుంటూ స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని అంతరాలను పంచుకోవాలని, ధర్మశాస్త్రం నిర్దేశించింది. అందుకే ఈ పండుగను "వసంతోత్సవం'' అని అంటారు. ఈ విధముగా పౌర జనపదులు అందరూ కలిసి, సింధూరచూర్ణం, భర్గుండ, గంధపుపొడి వంటివాటిని రంగురంగుల నీళ్ళల్లో కలుపుకుని, పిచికారీ వంటి సాధనాలతో ఒకరిపై ఒకరు జల్లుకుంటూ నృత్య, గీత, వాద్యాలతో మహోత్సవం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.


ఈ విధముగా ఆనందించిన తరువాత ఒంటికి నలుగుపెట్టుకుని, తలస్నానం చేయాలి. తరువాత ఆవుపేడతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లని వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని, తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందనతిలకం దిద్దించుకుని, నీరాజనం పొంది, చందనంతో కూడిన మామిడి పువ్వును భక్షించాలి. దీనినే "చూత కుసుమ భక్షణం'' అంటారు. ఇది కోరికలనూ తీరుస్తుందని శాస్త్రప్రమాణం. ఇలా ఈ మూడురోజులు జరుపుకునే ఉత్సవాలతోనే ఈ హోళీకాపూర్ణిమ పండుగ పూర్తవుతుంది.


కానీ నేటికాలం వారికి అంత ఓపికలు లేవు. హోలీపండుగా నాడే రంగులు జల్లుకోవడం చేసేస్తున్నారు. కామదహనాన్ని మర్చిపోయారనే చెప్పాలి. రంగులు జల్లుకోవడం కూడా ఆనందం సంగతి అటుంచి, అల్లరి ఎక్కువైంది. రంగుల్లో రసాయనాలు చోటు చేసుకుని, హానికరాలు అవుతున్నాయి. పండుగనాడు కళ్ళుపోయే ప్రమాదాలు కొనితెచ్చుకునే పరిస్థతి ఎదురవుతోంది. కనుక ఈ విషయాలు గుర్తించి, శాస్త్రానుసారం ఈ హోళీ పండుగను అందరితోనూ, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, జరుపుకుందామని, సుఖసంతోషాలను పంచుకుందామని, జీవితాన్ని రంగుల హరివిల్లు చేసుకుందామని, ఆశిస్తూ, ఆకాంక్షిస్తున్నాం. ఈ పండుగతో నూతన ఉగాదికి స్వాగతం పలుకుదాం.