Facebook Twitter
వెలుగు రేఖ

మనలోని బలహీనతను భయాన్ని దూరం చేసుకోలేకపొతే బతుకు దుర్బరంగా మారుతుంది. భయం భయంగా జీవించడం కన్నా పెద్ద కష్టం ఉండదు.  ఏ పరిస్థితిలోనైనా మనిషి తనను తాను నిందించుకోకూడదు. పరనిందే కాదు, స్వీయనిందా ప్రమాదకరమే. జీవిత కాలంలో తప్పులే  చేయకుండా బతకడం కష్టం, మనం సామాన్య మానవులం సదా నిజమే పలకడానికి  హరిశ్చంద్రులం కాము. శరీరం నుంచి నిర్చయమైన జీవితం కోసం తపించే అత్యంత సాధారణ మనుషులం, మనం అజ్ఞానాన్ని అంగీకరించిన  మరుక్షణమే మనలోకి తొలి వెలుగు రేఖ ప్రవేశిస్తుంది. 

 మనసులో ఒకటి, బాహ్యంగా మరో భావనతో జీవించడం తగని పని మనసులో ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. అవి మంచి కోరికలా, చెడు కోరికలా అనేది విశ్లేషించుకోవాలి. ఎదుటివాడి  జేబులోని  

డబ్బు అయాచితంగా మనకు చేరాలని ఆశించడం చెడుకోరిక  ఏదైనా మంచిపని చేసి డబ్బు సంపాదించాలనుకోవడం మంచి కోరిక;  ఏదైనా ... కోరికలపై నియంత్రణ ఉంటేనే జీవితం ఆనందంవైపు పయనించే అవకాశం ఉంటుంది.

       కోరికలు గుర్రాలు కాకూడదని అంటారు. గాఢమైన కోరిక ఉన్నవాడు ప్రపంచంలో అందరికంటే దుఃఖంతో ఉన్నవాడని  భర్తహరి సుభాషిత త్రిశతి చెబుతుంది. మనం కోరికలు నియంత్రించుకోవడంలో మెదటి వారిగా ఉండాలి. అప్పుడు కనిపించే దారి మనల్ని ఆనందమయ జీవితంవైపు వెళ్ళేలా చేస్తుంది. మనిషికి నైతిక స్వభావమే  చైతన్యానికి కారణమవుతుంది. ఆ చైతన్యమే మరింత వృద్ధి పొంది నిర్బయత్వంగా  రూపాంతరం చెందుతుందని అద్వైత వేదాంతి గౌడపాదుడు మాండూక ఉపనిషత్తు బాష్యంలో ప్రస్తావించాడు. ఆనందం అధ్యాత్మికమై ఉండాలి. సంతోషానికి, ఆనందానికి చాలా తేడా ఉంది. ఆనందం అంతర్గత విషయం,  సుఖానుభూతి క్షణికం, అది కాలానికి సంబందించినది.  పరమానందం అలౌకికం, అది కాలానికి  అతీతం సూర్యుడినుంచి ఉషోదయాన వెలువడే వెలుగురేఖ ఎంత గొప్పదో, పరమానందం సైతం నిర్వచించలేనంతటి గొప్పది. 

ఆనందానికి లక్ష్యసిద్దితో పని లేదు. సంతోషానికి కోరికతో అవసరం ఉండదు. ధనం, అధికారం, పేరు ప్రతిష్టలు నిపుణతకు కారకాలు కావు, ఎన్ని ఉన్నా సంతుష్టితో జీవించలేని మానవులెందరో ఉన్నారు. ఏమీ లేని  సామాన్యుడి ముఖంలోని వెలుగు రేఖ, వర్చస్సు ఒక్కోసారి ఎంతటి ధనవంతుడిలో నైనా కనిపించవు.  

 సంతోషానికి చైతన్యం  కారణమని ఉపనిషత్తులు సైతం చెబుతున్నాయి, పరమానందం అన్నది ఒక వెలుగు రేఖ దాని జిలుగుకు అంతమే ఉండదు. 

 సుఖానుభవం పశువులకు సైతం లబిస్తుంది. సంతోషం మానవుడి అనుభవం, కానీ పరమానందం దైవత్వం, సాధకుడికి ప్రయత్నం వల్ల పరమానందం ఉబికి వస్తుంది. మనలోనుంచి మనం సాధించుకున్న పరమానందం మనల్ని సంతృప్తుల్ని చేస్తుంది. దాన్ని బాహ్య ప్రపంచంలో అన్వేషించాల్సిన  అవసరం లేదు. అది వెలుగు రేఖగా ఉదయించేందుకు మన లోపలే సిద్ధంగా ఉంది!       

                - అప్పరుసు రమాకాంతరావు.