Facebook Twitter
బంగారు గరిటె

బంగారు గరిటె

 

అనగనగా ఒక ఊళ్లో ఒక అవ్వ ఉండేది. ఊరి పొలిమేరల్లో నివసించే ఆ అవ్వను అందరూ ఊరికే 'పేదరాసి పెద్దమ్మ' అని పిలిచేవాళ్ళు; కానీ ఎవ్వరూ నిజంగానైతే ఆ అవ్వను పట్టించుకునేవాళ్లు కాదు. వ్యవసాయం పనులు ఉన్నప్పుడు కూలీగా వెళ్తుండేది అవ్వ. చక్కగా శ్రమపడి నడుం వంచి పని చేసేది. అట్లా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది; వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండగ ఉండే వారాల్లో ఎక్కువ సరుకులు- ఎందుకంటే పండగ రోజున ఎవ్వరైనా అవ్వ ఇంటి ముందు నిలబడి అడిగితే లేదనేది కాదు: వాళ్లను ఇంట్లోకి పిలిచి కడుపు నిండా భోజనం‌పెట్టి గానీ‌ పంపేది కాదు.

అట్లా ఓసారి అవ్వ తను వారమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో పండగ సరుకులు తెచ్చుకున్నది. ఆ రోజే పండగ. అవ్వ తినేందుకు పులిహోర, రవ్వకేసరి చేసుకున్నది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది పాపం. సాయంత్రం వరకూ ఎవ్వరూ రాలేదు గానీ, ఇక చీకటి పడుతున్నదనగా దూరదేశం నుండి ఎవరో పండితుడు ఆకలితో వచ్చి 'తినేందుకు ఏమైనా ఉందా తల్లీ?!' అని అడిగాడు.

 


అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరి పెట్టింది తినేందుకు. కేసరి అంతా తినేసాడాయన. అన్నం పెడితే అంతా అయిపోచేసాడు. పండగకు చేసిన అన్ని పదార్థాలూ తినేసాడు. అయినా ఇంకా ఆయన ఆకలి తీరినట్లు అనిపించలేదు. ఆలోగా అవ్వ తను వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలన్నీ వండింది. ఇంట్లో ఉన్న బియ్యమంతా వండి వార్చింది. మొత్తం ఆయనకు వడ్డించింది. పండితుడు ఆమెకేసి సంతోషంగా చూసి, ఏమి పెడితే అదంతా తినేసాడు గబగబా. పెడితే ఇంకా తినేట్లు అనిపించాడు! అవ్వకి ఇంక ఏం చేయాలో పాలు పోలేదు. ఏమంటే ఆ సరికి ఇంట్లో తను కూడబెట్టుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ అయిపోయాయి; బియ్యం కూడా ఖాళీ! డబ్బులూ లేవు!

ఇక మిగిలిందల్లా అవ్వకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిటె మాత్రమే. ఆ గరిటె అంటే అవ్వకు చాలా ఇష్టం. ఇన్నేళ్ళుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉండిందామె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి, దాన్ని అయిన లెక్కకు అమ్మేసి, ఆ డబ్బుతో కూరలు, సరుకులు తీసుకొచ్చి పండితుడికి వండి పెట్టింది. పండితుడు ఆమె వంటని మెచ్చుకుంటూ తిని, చెయ్యి కడుక్కుంటూ "తల్లీ! ఉన్నదంతా నాకే పెట్టినట్లున్నావు. మరి నీకు?" అని అడిగాడు. "ఇవాళ్ళ పండగ కదా, స్వామీ! ఇవాళ్లంతా ఉపవాసం ఉండి, రేపు తింటాను నేను" అన్నది అవ్వ. "మరి వంట చేసేటప్పుడు దేనితో‌ కలుపుతావు తల్లీ?!" అడిగాడు పండితుడు.

 

"సండ్రకట్టెతో కలిపితే వంట చాలా బాగుంటుంది స్వామీ!" అన్నది అవ్వ టక్కున. పండితుడు నవ్వి, "నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లీ! కానీ ఎక్కడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ‌ త్యాగంతో నా ఆకలి తీరింది. ఇదిగో, నీకో బహుమతి" అని తన జోలెలోంచి ఒక బంగారు గరిటెని బయటికి తీసి అవ్వకు ఇచ్చాడు. "ఇదిగో తల్లీ! ఇక ఇది నీ గరిటె. దీనితో నువ్వు ఏమి వండినా అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇకపైన ఏ ఆటంకమూ ఉండదు" అని అవ్వను ఆశీర్వదించి, వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇక ఆ దారిన పోయేవాళ్ళెవ్వరూ ఆకలితో‌ పోలేదు!
 

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో