బాదం-పిస్తా కుల్ఫీ
.jpg)
కుల్పీ.. వేసవి కాలంలో చల్లగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు చాలామంది చాయిస్ గా కుల్పీనే ఉంటుంది. చాలామంది మార్కెట్లో దొరితే కంపెనీల ఐస్ క్రీమ్ లు తింటూ ఉంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతుంటారు. అందుకే చాలామంది కుల్పీలు ఇష్టపడతారు. కుల్పీ తయారీలో చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉపయోగిస్తారు. అంతేకాదు.. కాస్త ఓపికగా ట్రై చేస్తే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందులోనూ బాదం-పిస్తా కుల్పీ చాలామందికి ఫేవరెట్ గా ఉంటుంది. ఈ బాదం-పిస్తా కుల్పీ ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
పాలు – 1 లీటరు (ఫుల్ క్రీమ్) ఖోయా లేదా కోవా – 1/2 కప్పు (100 గ్రాములు) పంచదార – 1/2 కప్పు (లేదా రుచికి తగినంత) బాదం పప్పులు – 1/4 కప్పు (సన్నగా తరిగినవి) పిస్తా పప్పులు – 1/4 కప్పు (సన్నగా తరిగినవి) యాలకుల పొడి - 1/2 టీస్పూన్ జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి) కుంకుమపువ్వు – 1 చిటికెడు (పాలలో నానబెట్టినది) కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు.
తయారీ విధానం..
మందపాటి అడుగు ఉన్న పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగేటప్పుడు మంటను మధ్యస్థంగా తగ్గించి, పాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పాలు సుమారు సగం అయ్యేంత వరకు మరిగించాలి, దీనికి 30-40 నిమిషాలు పడుతుంది.
పాలు సగం అయ్యాక అందులో కోవా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. దీని తరువాత చిక్కబడిన ఈ పాలలో చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి , నానబెట్టిన కుంకుమపువ్వు కలపాలి.
సన్నగా తరిగిన బాదం, పిస్తా , జీడిపప్పులను కలపాలి. గార్నిష్ కోసం కొన్నింటిని పక్కన ఉంచుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని 5-7 నిమిషాల పాటు ఉడికించి, ఆపై స్టౌ ఆపివేసి చల్లారనివ్వాలి.
తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లేదా చిన్న కప్పులలో పోసి, మిగిలిన బాదం మరియు పిస్తా పప్పులతో గార్నిష్ చేయాలి.
కప్ లు లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ను 6-8 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టినప్పుడు , బయటకు తీసి ఆస్వాదించడమే. వేసవికాలంలో ఎంతో ఆరోగ్యకరంగా, టేస్టీగా పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే బాదం-పిస్తా కుల్పీ తయారైపోయినట్టే.
*రూపశ్రీ. |