తలసాని తగ్గవయ్యా
Publish Date:Jul 22, 2015
Advertisement
రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపైనే చర్చలు జరుగుతున్నాయి. అసలు తలసాని రాజీనామా చేశాడా? చేయకుండా డ్రామా ఆడాడా? ఒకవేళ చేస్తే ఎందుకు ఆమోదించలేదు? అనే ప్రశ్నలు క్యూ కడుతున్నాయి. కానీ తాను మాత్రం 2014 డిసెంబర్ 16న ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజీనామా చేశానని.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకొని మరీ తిరుగుతున్నానని చెప్పుకొస్తున్నారు. అంటే తాను రాజీనామా చేసినా ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు ఆమోదం పొందలేదు.. స్పీకర్ ఎందుకు తలసాని రాజీనామాను ఆమోదించలేదు.. అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో తప్పు స్పీకర్ దా! అలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కానీ ఒకసారి స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇస్తే స్పీకర్ దానిని తన జేబులో ఉంచుకోరు. వెంటనే సంబంధిత సెక్షన్‌కు పంపిస్తారు. కానీ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి మాత్రం తమకు తలసాని రాజీనామా చేరలేదని ఈ నెల 8వ తేదీన కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. అంటే తలసాని రాజీనామా లేఖ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పినట్టు అర్ధమవుతోంది. ఒకవైపు రాజీనామా చేశాడో లేదో తెలియని నేపథ్యంలో ఉంటే తలసాని మాటలు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిపక్షనేతల మీద సవాళ్లమీద సవాళ్లు విసురుతున్నారు. రోజూ ఉదయం లేచిన దగ్గరనుండి తన పేరే జపం చేస్తున్నారని.. రోజూ నాకు పూజ చేయండంటూ విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి, నాలుగు రోజులు తనది కాదనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని.. తన గురించి మాట్లాడితే అందరి చిట్టా విప్పుతానని.. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని, ఎవరు వస్తారో రండని సవాళ్లు విసురుతూ ప్రగల్భాలు పలికారు. దీంతో రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్న తలసాని ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగ్గిస్తే మంచిదని.. దాని బదులు రాజీనామా ఆమోదించుకుని ఎన్ని ప్రగల్భాలు పలికినా బావుంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ తెదేపా నేతలు నిన్ననే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈరోజు తలసానిని తెలంగాణ మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరేందుకు టీడీపీ నేతలు ఈ స్పీకర్ నివాసానికి వెళ్లారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్పీకర్ ఇంటి ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తలసాని రాజీనామా చేసి 6 నెలలు అవుతున్నా స్పీకర్ ఎందుకు ఆమోదం తెలపలేదని.. తలసాని తెలంగాణ ప్రభుత్వం కలిసి నాటకాలు ఆడుతున్నారని.. ఇక ఏ ఎన్నికల్లో తలసాని పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ఒకవేల తలసాని రాజీనామా చేసి రాబోయే ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. మరి ఈ సవాళ్ల పర్వంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.
http://www.teluguone.com/news/content/talasani-srinivas-yadav-39-48531.html





