ఓ సినీ వట వృక్షం.. శివశక్తి దత్త
Publish Date:Jul 9, 2025
Advertisement
ఒక్కో వంశానికి ఒక్కో మూల పురుషుడు ఉంటారు. రాజమౌళి వంశానికి శివశక్తిదత్త అలాగ. ఎందుకంటే ఆయనేగానీ తాను సినిమాల్లోకి రావాలని అనుకోకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలా కుటుంబానికి సినిమా పిచ్చి పట్టి ఉండేదే కాదు. రాజమౌళీ వంటి లెజండరీ డైరెక్టర్లు వచ్చి ఉండేవారు కాదు అంటారు నిపుణులు. శివశక్తి దత్త.. చెప్పుకోడానికి కేవలం గీత రచయిత. అంతే అనుకోవడంతో సరిపోదు. ఆయన ప్రభావం ఆ ఇంట శాఖోప శాఖలుగా విస్తరించింది. ఆయన రాసిన పాటలు కొన్నే కావచ్చు. ఆయన దర్శకత్వం వహించింది ఒకటి రెండు సినిమాలే కావచ్చు. కానీ ఆ ఇంట్లో లేని టెక్నీషియన్ లేరు. మీకు తెలుసో తెలీదో.. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సినీ నిపుణులే. ఒక సీన్ ఎక్కడో వంటింట్లో కూరలో పోపు వేస్తూనే విని.. అది జనానికి ఎక్కుతుందా ఎక్కదా.. చెప్పేయగలరు రాజమౌళి తల్లి. వారి ఇంట్లో పని చేసే వారు కూడా సినిమా పట్ల ఒక పేషన్ని కలిగి ఉంటారు. ఒక సమయంలో నాగార్జున ఇండస్ట్రీలో ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకున్నా రాజమౌళి ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోలేమని అన్నారు. అందుకు కారణం.. ఆ కుటుంబం అంతటి సిని జీనియస్ ల నిలయం కావడమే. దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్, దిగ్దర్శకుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి.. ఇలా వారి ఇంట్లో ఇంకా రకరాల రంగాలకు చెందిన వారు ఉన్నారు. కాంచి సైతం కామెడీ పండించడంలో దిట్ట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రమా రాజమౌళీ సైతం కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఎక్స్ పర్ట్. తర్వాతి తరం కూడా మత్తు వదలరా అంటూ కామెడీ పండిస్తూ.. ప్రేక్షక జనాన్ని ఉర్రూతలూగించేదే. ఇక సంగీతంలో కీరవాణితో పాటు శ్రీలేఖ, కళ్యాణీ మల్లిక్ వంటి వారు సైతం ఈ కాంపౌండ్ లోంచి వచ్చిన వారే. కళ్యాణి మల్లిక్ అయితే.. శివశక్తి దత్త కుమారుడు. ఒక్క సినీ జీవి ఒక విత్తనంలా మారి ఆ ఇంట 24 క్రాఫ్ట్ లలో దాదాపు సగం వరకూ రంగాల్లో విస్తరింప చేసింది ఎక్కడైనా ఉందంటే అది శివశక్తిదత్త ఇంట్లోనే. ఆయన తన 92వ ఏట మంగళవారం (జూలై 7) హైదరాబాద్ మణికొండలోని తన స్వగృహంలో వయోధిక సమస్యల కారణంగా మరణించారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక మేరు నగ ధీర, ఒక మహా సినీ వట వృక్షం నేలకూలిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయన తెలుగు సినిమాల్లో సంస్కృత పాటలకు పెట్టింది పేరు. ఈయన విజయేంద్ర ప్రసాద్ కి సోదరుడు, కీరవాణికి తండ్రి. రాజమౌళికి పెదనాన్న అవుతాడని అనడం కన్నా.. వారందరికీ ఆరాధ్య దైవం. సినీ భిక్ష పెట్టిన ఆదిగురువుగా చెప్పాలి. శివశక్తి దత్త సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి టూ, ట్రిపుల్ ఆర్, హనుమాన్ వంటి సినిమాలకు పాటలు రాశారు. బాహుబలి చిత్రంలోని మమతల తల్లి, ఛత్రపతిలో అగ్ని స్ఖలన, మన్నేల తింటివిరా కృష్ణ, రాజన్నలో అమ్మా అవని వంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాశారు. అలా అలా శివశక్తి దత్త సినీరంగంలో ప్రవేశించిన తర్వాత ఆయన సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1988లో విడుదలైన జానకి రాముడు సినిమా ద్వారా శివశక్తి దత్తా రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆపై ఆయన రచించిన పాటలు, స్క్రీన్ ప్లేలు.. తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.
ఆయన మొదట సినిమా వారు కారు. సాహితీ వేత్త కావడం వల్లే సినిమాల్లోకి వెళ్లాలని భావించారు. అలా సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ ముంబై వెళ్లి జేజే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. అక్కడ చిత్రకళపై ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత కమలేశ్ అనే కళం పేరిట చిత్రకారుడిగా కొంత కాలం పని చేశారు. సంగీతం పట్ల మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు.
http://www.teluguone.com/news/content/shivashakti-datta-cine-vatavruksha-39-201555.html





