చిక్కుల్లో వల్లభనేని వంశీ.. విషయమేంటంటే?
Publish Date:Dec 2, 2025
Advertisement
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లేనా అంటే తాజాగా జరిగిన పరిణామంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ.. అసెంబ్లీకి ఎన్నికైన రెండు సార్లూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో వల్లభనేని వంశీ అవకాశవాదిగా మారి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో పార్టీలు మారడం అసాధారణమేమీ కాదు. అయితే పార్టీ మారిన తరువాత మాత్రం ఆయన వ్యవహార శైలి అసాధారణంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వంశీ స్వయంగా గన్నవరం నుంచి ఓడిపోయారు. వైసీపీ హవా కొనసాగిన కాలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి దూరం కావడంతో పరాజయం పాలై మాజీ అయిపోయారు. అయితే గతంలో చేసిన తప్పులు వదలవుగా.. ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదుగా? అందుకే వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వంశీకి ఆ కేసులు చుట్టుముట్టాయి. దాడులు, దౌర్జన్యాలు, మోసం, కబ్జా ఇలా పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు వంశీపై ఉన్నాయి. వీటిల్లో గన్నవరం తెలుగుదేశం కార్యాలంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టై ఏకంగా 137 రోజులు రిమాండ్ ఖైదీలో కటకటాల వెనుక గడిపి బెయిలుపై బయటకు వచ్చారు. అయితే తాజాగా అదే కేసులో నిందితులై ఇంత కాలం పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరులలో ఇద్దరిని కోర్టు రిమాండ్ కు పంపింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్నవంశీ అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వారిరువురూ ఆ వారెంట్ వెనక్కు తీసుకోవాలని కోరుతూ విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఇరువురూ కోర్టులో సరెండర్ అయ్యారు. వారి అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయిన తరువాత వారిరువురినీ ఈ నెల 15 వరకూ రిమాండ్ కు పంపిసతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిరువురినీ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా నలుగురు పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇరువురిని కోర్టు రిమాండ్ కు పంపడంతో ఈ కేసులో బెయిలుపై ఉన్న వంశీకి కూడా చిక్కులు తప్పవని అంటున్నారు. ఈ ఇరువురి అరెస్టు ప్రభావం బెయిలుపై ఉన్న వంశీపై పడటం ఖాయమంటున్నారు.
http://www.teluguone.com/news/content/satyavardhan-kidnap-case-vamshi-in-trouble-again-25-210335.html





