‘రాజ్యాంగ హత్య దినం’ సబబేనా?
Publish Date:Jul 15, 2024
Advertisement
కారణాలు ఏమైనప్పటికీ, 1975, జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని ప్రభావం, పర్యవసానాల సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఇందిరాగాంధీ కూడా ఆ తర్వాత తాను ఎమర్జెన్సీని ప్రకటించడం తప్పేనన్న విషయాన్ని అంగీకరించారు. ఎమర్జెన్సీని విధించిన తప్పుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆ తర్వాత ఆమెను క్షమించి మళ్ళీ అధికారం ఇచ్చారు. ఇందిరాగాంధీ అధికారంలో వుండగానే, ప్రధానమంత్రిగా అందరి నుంచి జేజేలు అందుకుంటున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. అదంతా ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం.. మానిపోయిన గాయం. ఇప్పుడు ఆ గాయాన్ని అధికారికంగా రేపి రాజకీయ లబ్ధిని పొందాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. ఎమర్జెన్సీని ప్రకటించినందుకు ఇందిరాగాంధీని ఇప్పటికీ నోరున్న ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వుంటారు. బీజేపీ వర్గాలయితే ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తూనే వుంటారు. ఇందిర, నెహ్రూ దేశానికి చేసిన సేవలు బీజేపీ వాళ్ళకి ఎప్పుడూ కనిపించవు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శించడానికి బీజేపీకి చెందిన గల్లీ కార్యకర్త అయినా నేను సిద్ధం అంటూ రెడీ అయిపోతాడు. ఇలా ఒక పార్టీ వేదికగా ఎవరయినా, ఎవర్నయినా విమర్శించవచ్చు. కానీ, ప్రభుత్వం పరంగా మాత్రం అలా చేయడానికి చాలా పరిమితులు వుంటాయి. ఆ పరిమితులన్నీ బీజేపీ ప్రభుత్వం దాటింది. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్య దినం) పేరిట అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం కంటే దారుణమైన చర్య అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనాడో ఒక మాజీ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అధికారికంగా విమర్శించే విధంగా చేయడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజీపీకి అధికారం వుంది కాబట్టి, తనను ఆపే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి ‘రాజ్యాంగ హత్య దినం’ అంటూ ప్రకటించారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో వస్తుంది. అప్పుడు మోడీ నోట్ల రద్దు చేసిన రోజును ‘అత్యంత తలతిక్కల దినం’ అనో, మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ‘అత్యంత విషాదాత్మక దినం’ అని ప్రకటిస్తే ఎలా వుంటుంది? ఇందిరాగాంధీని కానీ, మోడీని కానీ వ్యక్తిగతంగా ఎంతయినా విమర్శించవచ్చు. ఇలా ‘హద్దులు’ మీరి ఆ విమర్శలకు ‘అధికారం’ కల్పించడం ఎంతవరకు సబబు అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులను జనం దృష్టిలో పలుచన చేసే విధంగా నిర్మించే సినిమాలకు మద్దతు ఇస్తోంది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని పైకి తీసుకొచ్చి, దానికి అధికారికంగా ఒక పేరును ఇవ్వడం అనేది త్వరలో రాబోతున్న ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాకి హైప్ తేవడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా సెప్టెంబర్ 6, 2024న విడుదలవుతోంది. ఇందిరా గాంధీ మీద తమ ద్వేషాన్ని అధికారికంగా వెళ్ళగక్కడంతోపాటు కంగన రనౌత్ నిర్మాత కూడా అయిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మీద నేటితరం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్లానులో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకోకూడని నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/samvidhaan-hatya-diwas-is-it-correct-25-180787.html





