న్యాయవాది.. న్యాయానికి వారధి..!
Publish Date:Dec 3, 2025
Advertisement
మోసపోవడం, మోసం చేయడం, తప్పు చేయడం, తప్పించుకు తిరగడం, చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.. ఒకటి రెండు కాదు.. రాజ్యాంగం ఈ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు, షరతలు విధించింది. దేశ పౌరులకు కొన్ని హక్కులు, మరికొన్ని సరిహద్దు గీతలు గీసింది. వీటి నుండి ఏ వ్యక్తి అయినా అతిక్రమించి ప్రవర్తించినా, ఇతరులకు నష్టం కలిగించినా, ఇతరులకు అన్యాయం చేసినా.. అందరికీ న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఈ న్యాయవ్యవస్థ నుండి ప్రజలకు న్యాయం సమకూర్చి పెట్టడానికి వారధులుగా నిలిచేవారే న్యాయవాదులు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన న్యాయవాదుల దినోత్సవాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్బంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా సమాజంలో న్యాయవాదుల పాత్ర.. న్యాయ వ్యవస్థకు వారి సేవల గురించి తెలుసుకుంటే.. న్యాయానికి వారధులు.. ప్రతి వ్యక్తి తనకు అన్యాయం జరుగుతోంది అంటే చట్ట బద్దంగా న్యాయాన్ని అర్థించాలంటే దానికి న్యాయవాదుల సహాయం, వారి సలహా చాలా అవసరం. న్యాయవాదులే న్యాయస్థానానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారు. రాజ్యాంగం ప్రజలకు కేటాయించిన హక్కులను, రాజ్యంగం పేర్కొన్న నియమాలు, షరతుల ఆధారంగా న్యాయాన్ని చేకూర్చడంలో సహాయపడతారు. కర్తవ్యం.. చాలామంది మేము న్యాయవాదులం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా గర్వంగా చెప్పుకోవడం అనేది కేవలం న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదులు అయిపోగానే వచ్చేది కాదు.. న్యాయవాదికి అసలైన గౌరవం, అసలైన గుర్తింపు వచ్చేది బాధితులకు, న్యాయం కోసం తనను ఆశ్రయించిన వారికి న్యాయం జరిగేలా చూసినప్పుడే. అందుకే న్యాయవాది కర్తవ్యం ఏమిటంటే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం. అప్పుడే తన కర్తవ్యాన్ని తను సరిగా నిర్వర్తించినట్టు. వృత్తి-దుర్వినియోగం.. ప్రతి వ్యక్తి తను చేపట్టే వృత్తి ద్వారానే తన జీవనం సాగిస్తుంటాడు. అలాగే న్యాయవాదులు కూడా తమకు వచ్చే ఆదాయం ద్వారానే తమ జీవితాన్ని సాగిస్తుంటారు. కానీ చాలా వరకు ఇందులో ఆదాయం గురించి స్పష్టత ఉండదు. తమకు కేసులు లేకపోతే ప్రైవేటు లాయర్ల జీవనం, వారి కుటుంబ పోషణ సమస్యగా మారుతుంటుంది. అందుకే కొందరు తప్పటడుగు వేస్తారు. డబ్బు కోసం న్యాయానికి విరుద్దంగా కూడా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు న్యాయం వైపు నిలబడ్డామని చెబుతూ అన్యాయం వైపు సమర్థిస్తూ బాధితులను మోసం చేస్తుంటారు. ఇదంతా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ కేసులు, ఆస్తులు, ఆర్థిక విషయాలు అయితే ఇలాంటివి కోల్పోయిన వ్యక్తులు తిరిగి కోలుకుని మళ్ళీ జీవిత పోరాటంలో పడిపోవచ్చు. కానీ .. మానవ సంబంధాలు, ప్రాణానికి నష్టం కలిగించిన వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడకుండా చేయడం వల్ల న్యాయ విద్యను అభ్యసించి దాన్ని దుర్వినియోగం చేసినవారవుతారు. ఇలాంటి వారి వల్ల న్యాయ వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుంది. అటు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుకే న్యాయ విద్య అభ్యసించడం అంటే ఒక గొప్ప శాస్త్రాన్ని తమ చేతిలో ఆయుధంగా పట్టుకోవడం. న్యాయవాదులు తమ ప్రతిభను నిందితులను కాపాడటానికి బదులుగా బాధితులకు న్యాయం జరిగేలా చేయడానికి వినియోగించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. అన్యాయానికి అడ్డుకట్ట పడుతుంది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/lawyer-the-bridge-to-justice-35-210392.html





