జగన్ పుండు.. రఘురామ ఎట‘కారం’!
Publish Date:Jul 22, 2024
Advertisement
వైసీపీ ఎమ్మెల్యే జగన్ మీద పంచ్‌లు వేయడంలో రఘురామ కృష్ణంరాజుది ప్రత్యేక శైలి. ఐదేళ్ళ క్రితం జగన్ మీద మొట్టమొదట తిరుగుబాటు చేసిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు. ఆ తర్వాత జగన్ ఆయనని అరెస్టు చేయించడం, చిత్రం హింసలకు గురిచేయడం, చంపినంత పని చేయడం అవన్నీ తెలిసిన విషయాలే. ఆనాటి దారుణాల మీద రఘురామ కేసు పెట్టారు. జగన్‌తోపాటు కొంతమంది పోలీసు అధికారుల మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అలాగే ఎప్పటి నుంచో ‘రచ్చబండ’ పేరుతో జగన్‌ని ఉతికి ఆరేసే కార్యక్రమాన్ని రఘురామ నిర్వహిస్తున్నారు. ‘రామా’ అంటేనే బూతుమాటగా భావించే జగన్, రఘురామ చేసే కామెంట్ల విషయంలో ఎలా ఫీలవుతూ వుంటారో ఊహించవచ్చు. జనరల్‌గా రఘురామని చూస్తేనే జగన్‌కి ఎక్కడో సరసరా కాలుతూ వుంటుంది. అలాంటిది పుండు మీద కారం చల్లినట్టుగా, జగన్ దగ్గరకి రఘురామ వెళ్ళి కాస్తంత వెటకారంగా మాట్లాడితే పరిస్థితి ఎలా వుంటుందో కదా! అలాంటి ఆసక్తికరమైన సంఘటన సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. రాను రాను అంటూనే జగన్ అసెంబ్లీకి వచ్చారు. అక్కడ జగన్, రఘురామ ఎదురుపడే సందర్భం వచ్చింది. సాధారణంగా అయితే ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా తప్పుకుని వెళ్ళిపోవాలి. కానీ, రఘురామ వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, తన ఎదురుగా వున్న జగన్‌తో ‘‘అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ మీరు అసెంబ్లీకి తప్పకుండా రావాలి’’ అన్నారు. దానికి జగన్‌కి లోపల భగభగా మండిపోయినా, ముఖానికి నవ్వు పులుముకుంటూ వస్తానని సమాధానం ఇచ్చారు. రఘురామ అక్కడితో వదలకుండా, జగన్‌తో మరికొంతసేపు మాట్లాడారు. దానికి జగన్ కూడా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తన లోపల బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని కంట్రోల్ చేయడానికి, తన పుండు మీద పడిన కారాన్ని భరించడానికి జగన్ ఎన్ని తంటాలు పడ్డారో ఏమో! అసలు అక్కడ పూర్తి సంభాషణ ఏం జరిగిందో రచ్చబండ ద్వారా రఘురామ వివరిస్తే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/jagan-and-raghurama-met-in-assembly-39-181212.html





