సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా?
Publish Date:Jul 25, 2025
Advertisement
సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఆ లోగా సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా తెలపాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సజ్జల అమరావతి ప్రాంత ప్రజలు, మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న భయంతో సజ్జల ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ గురువారం జరిగింది. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు. ఆయన తన వాదనలో అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సజ్జలపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సజ్జల తరఫున వాదించిన పొన్నవోలు అరెస్టు చేస్తారన్న అనుమానం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేస్తారా? చేయరా? అన్న విషయం తెలపాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ.. సజ్జలపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకూ పొడిగిస్తూ కేసు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/highcourt-seeks-clarification-weather-case-book-or-no-against-sajjala-39-202690.html





