కృష్ణానదికి భారీగా వరద.. వందేళ్ల రికార్డు బ్రేక్!
Publish Date:Sep 2, 2024
Advertisement
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా ఈ సారి కృష్ణానదికి వరదలు వచ్చాయి. 121 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో కృష్ణా నదికి వరదలు వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. రికార్డుల మేరకు 1903లో, 2009లో కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చాయి. అయితే ఆ రెండు సందర్భాలలోనూ కూడా వరద ప్రవాహం పది లక్షల క్యూసెక్కులకు మించలేదు. అయితే ఈ సారి మాత్రం ఇప్పటికే కృష్ణలో నీటి ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులు దాటేసింది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో ముప్ఫై నుంచి 40 వేల క్యూసెక్కుల వరద వస్తే ప్రవాహం ప్రకాశం బ్యారేజి పెనుంచి వెడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గంటగంటకూ పెరుగుతున్న కృష్ణ వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిన్నటి నుంచీ నిర్విరామంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చంద్రబాబు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం ప్రజల నుంచి విజ్ణప్తులు వచ్చిన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నదికి భారీ వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజీ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది మరింత పెరిగితే ప్రకాశం బ్యారేజీపై నుంచి వరద ప్రవాహం సాగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సూచలను చేస్తున్నారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి సమయానికి వివిధ ప్రాజెక్టులలో వరద పరిస్థితి ఇలా ఉంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.55 లక్షల క్యూసెక్కులు ఉండగా, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.73లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.89 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.05లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 5.51లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
http://www.teluguone.com/news/content/heavy-floods-to-krishna-river-39-184081.html





