జగన్ పార్టీలో విబేధాలు, ఎన్నికలపై ప్రభావం!
Publish Date:Jul 1, 2013
Advertisement
పంచాయితీ ఎన్నికల్లో సత్తాచాటలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపుతుంటే, ఇదే సమయంలో ఆయా జిల్లాలో అసంతృప్తుల బెడద ఎక్కువవుతుండడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల,ఇంచార్జ్ ల నియామకం పార్టీలో సీనియర్ నేతలకు అసంతృప్తిని కలగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జగన్ పార్టీలోని లుకలుకలు వరుసగా బయటపడుతున్నాయి. తెలంగాణలో పార్టీ మరీ బలహీనంగా ఉండడంతో విజయమ్మ గత 25 నుండి తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఆమె తెలంగాణాలో పర్యటన చేస్తుండగానే ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయం బాబురావు, బోడ జనార్ధన్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాకినేని పెదరత్తయ్య చేరిన కొన్నాళ్లకే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీకి దూరమై ఇప్పుడు కాంగ్రెసు పార్టీలే చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారని సమాచారం. ఖమ్మం లోకసభ టిక్కెట్ పైన జగన్ నుండి హామీ లేకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు రెండు రోజుల క్రితం తాము పార్టీ వీడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నేతలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని అంటున్నారు. జగన్ పార్టీలో చేరుతున్న నేతలకు అధిష్టానమే అంతా ఖర్చు భరిస్తుందన్న అభిప్రాయంతో పార్టీలో చేరుతున్న వారు ఉన్నారట. అయితే వాళ్ళకు అన్ని ఖర్చులు భరించడం వీలుకాదని పార్టీ చెప్పడంతో బయటకు వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో నేతలు ఒకే సామాజిక వర్గం నుండి పార్టీలోకి వస్తున్నారట. ఇది కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/fissures-in-ysrcp-39-23975.html





