దాత చేయూతతో పాఠశాల భవనాన్ని.. కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు

  దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు వెళ్తారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ లో ఉంది ఈ పాఠశాల. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునికీకరించారు. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి.  సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల 1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని చాటుతున్నారు. పాఠశాలలో 17 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నరన్నారు.  పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం  ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దాత చేయూతతో పాఠశాల భవనాన్ని.. కార్పొరేట్ స్థాయిలో  నిర్మించారు Publish Date: Jul 20, 2025 10:56AM

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ చెరశాల తప్పదా?

వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టు ఆ దిశగా తొలి అడుగా అంటే ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అరాచకత్వం హద్దులు లేనట్టుగా సాగింది. అధికారాన్ని అడుపెట్టుకుని ఆయన కబ్జాలు, దౌర్జన్యాలకు యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు వాస్తవమేని తేలుతోంది. జగన్ హయాంలో ఆయన హద్దూపద్దూ లేకుండా సాగించిన కబ్జా వ్యవహారాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అటవీ భూములను ఆక్రమణలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల ద‌గ్దం కేసు విచారణలో పైళ్ల ద‌గ్దం ప్ర‌మాద‌శాత్తూ జరిగింది కాదని తేలింది.  ఆ ఫైళ్ల‌ దగ్ధం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి అనుచరులేనని దర్యాప్తులో తెలడంతో ఆయన అనుచరులు అరెస్టు కూడా అయ్యారు. ఇలా పెద్దిరెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలూ ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.  ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేయడంతో ఇక పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్య పునాదులు కదిలిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం ఏం చేసినా ఎదురేలేదన్నట్లుగా సాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఇక సాగడం లేదని ప్రస్ఫుటమైందని అంటున్నారు.   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గతంలో చేసిన   అక్రమాలు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.  మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి అరెస్టయ్యారనీ, అలాగే తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, తిరుపతిలో భూ కబ్జాల వ్యవహారంలో పెద్దిరెడ్డి అరెస్టు కూడా తప్పదని అంటున్నారు. 
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ చెరశాల తప్పదా? Publish Date: Jul 20, 2025 8:14AM

ఇప్పుడిక విడదల రజనీ వంతు?

వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు  నిబంధనలను  ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై  విడదల రజినిపై  సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే పోలీసులు రజనీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం కూడా వాటిల్లిందని పేర్కొంటూ.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విడదల రజనీ వంతు వచ్చింది. ముందుముందు మరింత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.  వరుస కేసులు అరెస్టులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడిక విడదల రజని వంతు వచ్చిందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. విడదల రజనీపై జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘన కేసు మాత్రమే కాకుండా పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయి.   పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే విడదల రజిని మరిదిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి  జాషువా, రజిని పీఏ రామకృష్ణలు కూడా ఉన్నారు.   ఈ నేపథ్యంలో రెంటపాళ్ల కేసులో రజనీని అరెస్టు చేయడం అంటూ జరిగితే.. వరుస పీటీవారెంట్లతో ఆమె సుదీర్ఘకాలం కటకటాల వెనుకే ఉండేలా పోలీసులు వ్యూహాత్మకంగా సాగుతున్నారని అంటున్నారు.  
ఇప్పుడిక విడదల రజనీ వంతు? Publish Date: Jul 20, 2025 8:01AM

బిజేపీలో బహిర్గతమైన ఈటల, బండి వర్గపోరు!

తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే.. పార్టీ అధిష్ఠానమే రాష్ట్రంలో పార్టీని పతనం దిశగా నడిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తోంది.  తాజాగా ఈటల రాజేందర్ ఓపెన్ అప్ అయిపోయారు. సొంత పార్టీ వాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజేందర్  అన్న మాటేమిటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించిన క్షణం నుంచీ బీజేపీలో ఆసంతృప్తి జ్వాల భగ్గుమంది.  ఆ పదవిని ఆశించిన బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు మీ గుప్పిస్తున్నారు. రాజాసింగ్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా, ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు.  తాజాగా ఈటల రాజేందర్ తన నివాసంలో నిర్వహించిన బీజేపీ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడించేందుకు సొంత పార్టీ వారే కుట్రలు పన్నారన్నారు. అప్పట్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు క్యాడరేలేదని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి హుజూరాబాద్ నుంచి అప్పట్లో తాను ఓడిపోయాననీ, అయితే ప్రజల మనస్సులను గెలుచుకుని మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించాననీ చెప్పుకొచ్చారు.  తాను ఎన్నడూ వ్యక్తులను నమ్ముకుని, వారిపై ఆధారపడలేదనీ, ప్రజలను నమ్ముకునే ప్రజాజీవితంలో సాగుతున్నానని చెప్పుకున్న ఈటల.. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనీ, ఇక ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.   త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా సామాజిక మాధ్యమంలో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారన్నారు.   తాను ప‌ద‌వుల కోసం  వెంప‌ర్లాడ‌లేనీ, వాటి కోసం పార్టీలు మారలేదనీ చెప్పిన ఈటల గతంలో తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కు తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పానని గుర్తు చేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ హై కమాండ్ దృష్టికి తీసుకువెడుతున్నానని ఈటల చెప్పారు. ఈటల ఎక్కడా నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన విమర్శల దాడి నేరుగా బండిపైనేనని అర్ధమౌతూనే ఉంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో తనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు పడకుండా కుట్ర జరిగిందని రెండు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండవనీ, ఉండేది ఒకే వర్గం, అది మోడీ వర్గమని బండి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈటల బదులిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
బిజేపీలో బహిర్గతమైన ఈటల, బండి వర్గపోరు! Publish Date: Jul 20, 2025 7:17AM

మిథున్ రెడ్డి అరెస్ట్.. పెద్దిరెడ్డికి తొలి ఎదురుదెబ్బ

వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో  కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ లో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దరెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలినుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తుంది.  విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తలపడ్డారు.  అనేక సంద ర్భాల్లో చంద్రబాబు ను రాజకీయంగా దెబ్బ తీయడానికి రామచంద్రా రెడ్డి విఫలయత్నం చేశారు.  2004 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికి వైఎస్ తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్ కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి జగన్, మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తరవాత జరిగిన పరిణామాలలో చిత్తూరు జిల్లాలో అప్పటి వరకు వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచీ  చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగింది.  ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంటే.. 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ కూడా జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. 2019-24 మధ్య జగన్ క్యాబినెట్ లో పెద్దిరెడ్డి నంబర్ టూ గా ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే కుప్పం లో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓ వైపు జగన్ కు సంబంధించిన కీలక వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా   మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డికి ప్రత్యా మ్నాయంగా జగన్  ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏమి చేసినా రైట్ అన్నట్లుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు. జగన్ అధికారంలో ఉన్నంత వరకూ పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్లుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూక్జాల నుంచి దౌర్జన్యాల వరకూ చేయని అరాచకం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిందో.. అ అప్పటి నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచీ ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.   తనయుడి అరెస్ట్ తో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచం ద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా దీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు.  అయితే ఇప్పుడు మిధున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.  
మిథున్ రెడ్డి అరెస్ట్.. పెద్దిరెడ్డికి తొలి ఎదురుదెబ్బ Publish Date: Jul 19, 2025 9:52PM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జ్ షీట్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో  చార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం (జులై 18)న ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్.. ఆ చార్జిషీట్ లో కీలక విషయాలను పేర్కొంది.  దాదాపు 300 పేజీల ఈ చార్జ్ షీట్ లో వందకు పైగా ఫోరెన్సిక్ నివేదికలను పొందుపరిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకూ  . 62 కోట్ల రూపాయలను సీజ్ చేసిట్లు పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి   268మంది సాక్ష్యులను విచారించి, అరెస్టు చేసిన 11 మంది నిందితుల స్టేట్ మెట్లను కూడా ఆ చార్జ్ షేట్ లో పేర్కొంది.  బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మద్యం అక్రమ సొమ్మును పెట్టుబడులుగా పెట్టినట్లు సిట్ పేర్కొంది. అలాగే షెల్ క ంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సిట్ పేర్కొంది. అలాగే మద్యం అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలు, బంగారం దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు  ఆధారాలను, నిందితులు, సాక్ష్యుల స్టేట్ మెంట్లనూ కూడా సిట్ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది. కాగా సిట్ శనివారం (జులై 19)న అరెస్టు చేసిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిధున్ రెడ్డి పేరును ఈ చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. మిథున్ రెడ్డిని ఆదివారం (జులై 20) న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరే అవకాశం ఉంది. . 
ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జ్ షీట్ Publish Date: Jul 19, 2025 9:26PM

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. శనివారం (జులై 19) ఆయనను విచారణకు పిలిచిన సిట్ దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన తరువాత అరెస్టు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది.  ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆయనను రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  సిట్ విచారణలో  మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సంగతి విదితమే ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టివేశాయి. మిథున్ రెడ్డి అరెస్టుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సిట్ అరెస్టు చేసింది.  అదలా ఉండగా మద్యం కుంభకోణం కేసులు సిట్ ఈ రోజు కోర్టులో తొలి చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అయితే ఈ చార్జిషీట్ లో మిథున్ రెడ్డి పేరు లేదు.  
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు Publish Date: Jul 19, 2025 9:15PM

పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యాటనలో కపిలేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, అనంతరం శుభ్రంగా తుడిచారు. పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పర్యటన సందర్భంగా, శ్రీ కపిలేశ్వరాయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయానికి వచ్చిన ఆయన అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. పవిత్ర వస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించారు. అంతకుముందు, తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిత్యం గోధుమ కలర్ డ్రెస్‌లో కనిపించే సీఎం చంద్రబాబు కొత్త దుస్తుల్లో దర్శమిచ్చారు.
పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు Publish Date: Jul 19, 2025 8:25PM

లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌  ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలకుపైగా ఉన్న ప్రాధమిక ఛార్జ్‌షీట్‌‌ను సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు.  ఆ పత్రాలను ట్రంకు పెట్టెలో తీసుకెళ్లారు. మరో 20 రోజుల్లో రెండవ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ వారిని పలు దఫాలు విచారించింది.11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, వందకుపైగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జత చేసి కోర్టుకు సమర్పించారు.  మొత్తంగా రూ.62 కోట్లు సీజ్‌ చేసినట్లు సిట్‌ పేర్కొంది. ఛార్జ్‌షీట్‌లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రపై సిట్‌ అధికారులు పేర్కొనలేదు. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ పేర్కొంది. మద్యం పాలసీ మొదలు, బ్రాండ్‌ల తయారీ, డబ్బు తరలింపు  వాటిని చేరవేసిన డెన్‌లు, తదితర వివరాలు అన్నీ ఛార్జీషీట్‌లో పేర్కొంది. మొత్తం 26ె8 మంది సాక్షులను విచారించి సేకరించిన సమాచారం 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు అందులో పేర్కొంది.  షెల్ కంపెనీల ద్వారా డబ్బుని తరలించి, బ్లాక్ మనీనీ వైట్‌గా మార్చిన వైనాన్ని రియల్ ఎస్టేట్, బ్యాంకులు బంగారు దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు వివరాలను ఛార్జీషీట్‌లో పేర్కొంది. సాంకేతికంగా సమాచారం దొరకకుండా ధ్వంసం చేసిన ఫోన్‌లలోని సమాచారన్ని కుడా సేకరించినట్లు సిట్ బృందాన్నికి సేకరించినట్లు తెలుస్తోంది.ఈ కేసులో  ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్  కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 
లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌  ఛార్జ్‌షీట్‌ దాఖలు Publish Date: Jul 19, 2025 7:39PM

2026లో కాజీపేట నుంచి కోచ్‌ల ఉత్పత్తి : రైల్వే మంత్రి

  కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ప్రధాని మోదీ దానిని నేరవేర్చారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెగా కోచ్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.  కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు.పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాజీపేట నుంచి త్వరలో 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ద్వారా 40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారం అవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా 3 వేల మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.   వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాతమని కిషన్ రెడ్డి తెలిపారు  
2026లో కాజీపేట నుంచి కోచ్‌ల ఉత్పత్తి : రైల్వే మంత్రి Publish Date: Jul 19, 2025 6:19PM

వందల మంది మెడలో పాములు

  పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి ఎవరైన భయాపడుతారు.. అలాంటిది విషపూరిత సర్పాల జోలికి వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు పాములతో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని కాపాడుతుంటారు.  బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్‌లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగ పంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
వందల మంది మెడలో పాములు Publish Date: Jul 19, 2025 5:33PM

మహీంద్రా కంపెనీకి లోకేష్ ఆహ్వానం.. రియాక్ట్ అయిన ఆనంద్ మహీంద్ర

  రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా  సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి' అంటూ ఆ యాడ్‌‌కు తెలుగు క్యాప్షన్ రాశారు.  దానికి స్పందనగా రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మహీంద్రా గ్రూప్ ఏపీలో టక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ను ఆయన ఆహ్వానించారు.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామన్నారు.   ఏపీలో పరిశ్రమ స్థాపనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, మహీంద్రా సంస్థ దీనిపై ఆలోచించాలని కోరారు.  దీనిపై నేడు ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... మున్ముందు ఏం జరగనుందో చూద్దాంఃఅని ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
మహీంద్రా కంపెనీకి లోకేష్ ఆహ్వానం.. రియాక్ట్ అయిన ఆనంద్ మహీంద్ర Publish Date: Jul 19, 2025 5:09PM

స్ట్రెయిట్ ఫైట్ చేస్తా.. నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను : ఈటల

  అబద్దాల పునాదులపై కొందరు బతుకుతున్నారంటూ మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటకొక మాట లోపలొకమాట మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈటల అన్నారు. మనకు వీధి పోరాటలు అవసరం లేదు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలి అని ఈటల రాజేందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శామీర్‌పేటలో హుజూరాబాద్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ త్యాగాలకు అడ్డా అని కొనియాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు.  కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తన అభిప్రాయాలను కేసీఆర్‌కు మొహమాటం లేకుండా చెప్పేవాడినని తెలిపారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని అన్నారు. తాను బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఆత్మగౌరవం నిలబడిందని ఆయన వ్యాఖ్యానించారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి చాలామంది కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో తాను అడుగు పెట్టని గ్రామాలు లేవని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వార్డు సభ్యులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను పోరాటాలు చేయకుంటే కరీంనగర్ ప్రజలు అండగా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని.. వీరుడు ఎక్కడా భయపడడని  ఈటల రాజేందర్ అన్నారు.  బీజేపీలో అన్ని రకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటల చెప్పుకొచ్చారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధాని మోదీ మీటింగ్ పెట్టారని ఈటల అన్నారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు.  తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని.. తనకు తెలియని వారు లేరని... బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు. దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా.. వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని నొక్కిచెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.
స్ట్రెయిట్ ఫైట్ చేస్తా.. నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను : ఈటల Publish Date: Jul 19, 2025 4:48PM

వందేభారత్ రైళ్లలో 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్

  వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలో వందే భారత్‌ రైలు బయల్దేరే  పావుగంట ముందు కూడా  రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు.   ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా రైలు బయల్దేరే 15 నిమిషాలకు ముందు ఖాళీ సీట్ల వివరాలు తెలుపుతామని, ఆ సీట్లు ప్రయాణికు లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చను ఈ సౌకర్యం మంగళూరు సెంట్రల్‌-తిరువనంతపురం (నెం.20631), తిరువనంతపురం-మంగళూరుసెంట్రల్‌(నెం.20632), చెన్నై - ఎగ్మూర్‌- నాగర్‌కోయిల్‌(నెం.20627), నాగర్‌కోయిల్‌-చెన్నై ఎగ్మూర్‌ (నెం.20628), కోయంబత్తూర్‌-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20642), చెన్నై సెంట్రల్‌-విజయవాడ , మంగళూరు సెంట్రల్‌-మడగావ్‌ (నెం.20646), మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20671) తదితర 8 వందే భారత్‌ రైళ్లకు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
వందేభారత్ రైళ్లలో 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్ Publish Date: Jul 19, 2025 4:12PM

ఏఈ సూసైడ్ నోట్ కలకలం..రిలీవ్ చేయలేదని మనస్తాపం

    నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణమని తిరువూరులో జలవనరుల శాఖ ఉద్యోగి కిశోర్ ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావటం శుక్రవారం కలకలం డంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడు తున్నట్లు లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.  ఇప్పటి వరకు ఏఈఈ ఆచూకీ దొరకలేదు. 'నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో ఎన్ఎస్సీ ఓ అండ్ ఎం గౌరవరం సెక్షన్ కు బదిలీ అయింది. ఈఈ, డీఈఈ, ఈఎన్సీ... ఎమ్మెల్యే కొలికపూడితో కలిసి బదిలీ ఆపేలా రాజకీయం చేశారు. మా మామయ్య పార్టీ నాయకుడని జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య.. ఈఎన్సీకి చెప్పినా ఫలితం లేకపోయింది. ఒక దళిత ఉద్యోగిగా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని' లేఖలో రాశారు. ఆత్యహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగుల ఇరిగేషన్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. లేఖపై రక్తపు మరకలను పోలిన ఎర్రటి మరకలు ఉండడంతో కిశోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో బదిలీ కావడంతో స్థానికంగా అద్దెకు ఉండే ఇల్లు ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం ఏఈఈ కిశోరు ఆయన మామయ్య తన కారులో దించి వెళ్లారు.  మధ్యాహ్నం 2.45 గంట లకు తన కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లారు. లేఖను చూసి అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు తిరువూరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కిశోర్ ఫోన్ నెంబరు లొకేషన్ చూడగా, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజార వద్ద మధ్యాహ్నం 3.15 గంటలకు చివరిసారిగా ట్రేస్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆత్మహత్య లేఖలో కిశోర్ పేర్కొన్న పేర్లను అతని మామయ్య ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.
ఏఈ సూసైడ్ నోట్ కలకలం..రిలీవ్ చేయలేదని మనస్తాపం Publish Date: Jul 19, 2025 4:00PM

జ‌గ‌న్ అడ్డంగా దొరికాడు.. వ‌దిలేది లేదు

  ఏపీ సీఎం చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ప‌నితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్ర‌స్తావించారు. ఈ కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెన‌క్కి త‌గ్గిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెన‌క్కి త‌గ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. ఈ క్ర‌మంలో అస‌లు దొంగ‌లు దొరుకుతున్నార‌ని, ముఖ్యంగా గ‌త పాల‌కుడు జ‌గ‌న్‌ కూడా దొరికిపోయాడ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీనిని వ‌దిలి పెట్టేది లేద‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే దీనిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణం.. సిట్ విచార‌ణ జ‌రుగుతుండ‌డ‌మేన‌ని, తాను ఏం చెప్పినా.. ఆ ప్ర‌భావం విచార‌ణ‌పై ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే మాట్లాడ‌లేద‌న్నారు. ఇప్పుడు అంతా బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇక వెనుక‌డుగు వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. జ‌గ‌న్ తాను.. త‌ప్పులు చేసి.. వాటిని టీడీపీ నేత‌ల‌ పైనా.. త‌న‌పైనా వేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విష‌యంలో నాయ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌ను, ఆయ‌న ప‌రివారాన్ని ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించాల‌న్నారు.ఈ విష‌యంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ ఎంపీల‌కు చంద్ర‌బాబు సూచించారు. అవ‌స‌ర‌మైతే.. పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం విష‌యాన్ని కూడా లేవ‌నెత్తి.. చ‌ర్చ‌కు పెట్టాల‌న్నారు. సిట్ కూడా.. త్వ‌ర‌లోనే నివేదిక ఇస్తుంద‌న్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి ఎప్ప‌టిక‌ప్పుడు.. కౌంట‌ర్ ఇచ్చేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు
జ‌గ‌న్ అడ్డంగా దొరికాడు.. వ‌దిలేది లేదు Publish Date: Jul 19, 2025 3:44PM

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగారు. రీసైకిలింగ్  కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని సూచించారు. తిరుపతి సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని పేర్కొన్నారు.  వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్‌గా ఏపీ నిలిచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలకు, తిరుమలకు వచ్చే భక్తులకు సీఎం కీలక సూచనలు చేశారు. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చుడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్ధాలను సద్వినియోగం చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు . ఇళ్ల నుంచి, మార్కెట్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్ధాలను ఎంత మేర ఎరువులగా తయారు చేస్తున్నారని వివరాలు ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా చూడాలని స్పష్టం చేసిన సీఎం
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు Publish Date: Jul 19, 2025 3:29PM

అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు

  టీమ్ ఇండియా మజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. హైదరాబాద్‌లో కాదులేండి.. మహారాష్ట్రలోని నివాసంలో. ఆయన భార్య సంగీత బిజిలానీ పేరిట మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో గత కొద్ది కాలంగా ఎవరూ ఉండడం లేదు. తాజాగా ఆ ఇంటిని తెరిచి చూడగా చాలా వస్తువులు ధ్వంసమైనట్టు కనిపించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి జూలై 18 మధ్యలోనే ఈ దొంగతనం జరిగింది. దీంతో బంగ్లా సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక కాంపౌండ్ గోడ వైర్ మెష్‌ను తెంచుకుని లోపలికి చొరబడ్డారు. మొదటి అంతస్తు పైకి ఎక్కి, కిటికీ గ్రిల్‌ను బలవంతంగా తెరిచి బంగ్లాలోకి ప్రవేశించారు. లోపల ఉన్న రూ.50,000 నగదును, రూ.7,000 విలువైన టెలివిజన్ సెట్‌ను దొంగిలించారు. అలాగే ఇంటిలోని పలు వస్తువులను కూడా నిందితులు ధ్వంసం చేశారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఈ చోరీ గురించి పుణె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.  
అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు Publish Date: Jul 19, 2025 3:03PM

తెలంగాణలో సోమవారం సెలవు.. ఎందుకంటే?

  తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్బంగా ఈ నెల 21న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం  పబ్లిక్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆది, సోమవారం  విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మొత్తంగా సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి. మరోవైపు ఆదివారం, సోమవారం సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో వైన్స్‌లు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆషాడం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహా నగరం హైదరాబాద్ లో ఇప్పటికే బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. అయితే ఆదివారం ఆషాడ మాసంలో చివరి బోనాల పండుగ పూర్తవుతుంది. దీంతో సోమవారం రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక బోనాల పండుగ సెలవును ప్రకటించింది.
తెలంగాణలో సోమవారం సెలవు.. ఎందుకంటే? Publish Date: Jul 19, 2025 1:50PM

సిట్‌ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్  కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.  శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. మిథున్‌రెడ్డి రాక నేపథ్యంలో సిట్‌ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇది అని.. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని అన్నారు. నోటి మాటలతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు మిథున్‌రెడ్డి తెలిపారు.    
సిట్‌ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి Publish Date: Jul 19, 2025 1:31PM

టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్

  టీటీడీ దేవస్థానంలో  పని చేస్తున్ననలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్),  ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ  లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని  అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  వారిని సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో  టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ  భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది .ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.  
టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ Publish Date: Jul 19, 2025 12:45PM

రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం

కాంగ్రెస్ లో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావే అన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సంచలన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధమని సమాజిక మాధ్యమ వేదికగా స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 18)న యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందనీ, తానే ముఖ్యమంత్రిననీ అన్నారు. ఈ వ్యాఖ్యలను వ్యాఖ్యలపై కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదును చూసి సీఎంకు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించాల్సింది పార్టీ అధిష్ఠానం అన్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి తానే మరో పేదళ్లు సీఎం అన్న వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.  కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందనీ, అంతే కానీ ఎవరికి వారుగా సొంతంగా తమను తాము సీఎం అని ప్రకటించుకోవడం సరికాదని పేర్కొన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాంగ్రెస్ లో అనైక్యత మరో సారి ప్రస్ఫుటమైంది. 
రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం Publish Date: Jul 19, 2025 12:18PM

ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్.. బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ప్రకటించింది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం లేదు. పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమికి ఇప్పుడు ఒక భాగస్వామ్యపక్షం వైదొలగడం మింగుడుపడని అంశమే.  పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై శనివారం (జులై 19) ఇండియా కూటమి సమావేశం కానున్న సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, కూటమి సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్ఫష్టం చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి హాజరు కానున్నారు.   ఐక్యత విషయంలో ఇండియా కూటమి వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఆప్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శుక్రవారం (జులై 18) ప్రకటించిన సంగతి విదితమే.  అయినా ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకేననీ, ఆ తరువాత జరిగిన  ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తాము ఒంటరిగానే బరిలోకి దిగామనీ ఆప్ గుర్తు చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేసింది.  
ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్.. బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి Publish Date: Jul 19, 2025 12:13PM

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు.  అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమై, తీవ్ర ఆర్థిక సమస్యలతో చికిత్సకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందించేందుకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఫిష్ వెంకట్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  ఫిష్ వెంకట్ వయస్సు 53ఏళ్లు. గత మూడేళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో  బాధ పడుతున్నారు.  చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ముదిరిపోవడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది.  పేరుకి చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ ఫిష్ వెంకట్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.   ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్.   ముషీరాబాద్  మార్కెట్ లో చేపలు అమ్ముకునే వెంకటేష్ కి ఆ వ్యాపారమే ఇంటి పేరుగా మారిపోయి ఫిష్ వెంకట్ గా పాపులరయ్యారు.  
నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత Publish Date: Jul 19, 2025 11:11AM

మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు

ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ మరింత వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని సిట్ విచారించి..కొందరిని అరెస్ట్ చేసింది. అయితే తాజాగా సిట్ అరెస్టు చేస్తుందని ముందస్తు బెయిల్ కోసం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టు, సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని రెండు కోర్టులూ కూడా స్పష్టం చేశాయి.  మరో వైపు సిట్ కూడా మిథున్ రెడ్డి ని అరెస్టు చేసే దిశగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   అయితే   సిట్ విచారణ కు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ ఆధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మద్యం కుంభకోణంలో కేసులో నిందితుడు మిథున్ రెడ్డి సిట్ విచారణకు  శనివారం  హాజరుకానున్నారు.  ఉ  మద్యం కుంభకోణం కేసులో A 4 గా మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది.  మరో వైపు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కలత్తూరు నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి నారాయణ స్వామి  సైతం కనిపించడం లేదు. అరెస్టు భయంతో కనిపించకుండా పోయారని ప్రచారం జరుగుతోంది.
 మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు Publish Date: Jul 19, 2025 10:15AM

తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలు అబద్దం చెప్పడానికి ముఖ్య కారణాలు..!

  ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ నిజాయితీగా, వివేకవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా అబద్ధం చెబుతారు. ఆ తరువాత వారి ప్రవర్తన అలానే కొనసాగుతుంది.   పిల్లలు అలా చేయడం తెలిసిన తరువాత  తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అసలు పిల్లలు అబద్దం చెప్పడం ఎందుకు నేర్చుకుంటారు? పిల్లలు అబద్ధం చెప్పకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? పిల్లలు అబద్దం చెప్పే విషయంలో  తల్లిదండ్రులు చేసే ఐదు సాధారణ తప్పులు తెలుసుకుంటే.. శిక్ష..  పిల్లు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు శిక్షతో బెదిరిస్తే, తదుపరిసారి భయం కారణంగా వారు నిజం దాచడం ప్రారంభిస్తారు.  ఇది అబద్ధం చెప్పే అలవాటును పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ నిజం చెప్పినందుకు శిక్ష పడుతుందనే భయం లేనప్పుడే పిల్లలు తన తల్లిదండ్రుల ముందు తన తప్పును అంగీకరిస్తాడు. అతిగా రియాక్ట్ కావడం.. తల్లిదండ్రులు చిన్న విషయాలకు కోపం చేసుకున్నా  లేదా అరిచినా పిల్లలు నిజం చెప్పలేరు. ఎందుకంటే  నిజం చెప్పి ఇబ్బందులను ఆహ్వానించడం సరికాదని పిల్లలు భావిస్తారు. ఈ కారణంగా పిల్లలు అబద్ధాన్ని తన రక్షణ కవచంగా చేసుకుంటాడు.  ఏదైనా చెప్పడం కంటే విషయాలను దాచడం మంచిదని పిల్లలు భావిస్తారు. భావాలను విస్మరించడం.. పిల్లల మాటలను విస్మరించినప్పుడు లేదా తీవ్రంగా పరిగణించనప్పుడు పిల్లలు  తమ ఆలోచనలను మార్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  నిజాలు  దాచడం ప్రారంభిస్తారు. తరచుగా తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలను, వారి ఇష్టాన్ని  పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయాలు చేస్తారు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లవాడు వారి ముందు నిజం మాట్లాడకుండా చేస్తుంది. అబద్దం.. తల్లిదండ్రులు స్వయంగా ఇతరులకు అబద్ధం చెబితే, ఉదాహరణకు ఫోన్‌లో 'నేను ఇంట్లో లేను' అని చెప్పడం వంటివి చేస్తే, పిల్లవాడు దానిని సాధారణమైనదిగా భావిస్తాడు.  పిల్లలు  కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. అదే సమయంలో, తల్లిదండ్రులు తరచుగా పిల్లల ముందు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు,  అబద్ధం చెప్పడం ఒక సాధారణ విషయంగా పిల్లలు పరిగణిస్తారు.  తను కూడా అబద్దం చెప్పడం అలవాటు చేసుకుంటారు. విమర్శ.. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు అతన్ని విమర్శిస్తే, ఇంకొకసారి తల్లిదండ్రులు తనను విమర్శించకూడదని  నిజం దాచడానికి అబద్దం చెబుతాడు. సాధారణంగా పాఠశాల పరీక్షలలో పిల్లవాడు తక్కువ మార్కులు పొందినప్పుడు ఇది కనిపిస్తుంది. తల్లిదండ్రులు తన మార్కుల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు, పిల్లవాడు ఇంకొకసారి  తన రిపోర్ట్ కార్డును వారికి చూపించకుండా  అబద్ధం చెప్పడం వంటివి చేస్తాడు.                               *రూపశ్రీ.  
తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలు అబద్దం చెప్పడానికి ముఖ్య కారణాలు..! Publish Date: Jul 19, 2025 9:30AM

ప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళలు చేసే ఈ తప్పు.. సి-సెక్షన్ కు పెద్ద కారణం..!

గర్భధారణ సమయంలో చాలా సార్లు తల్లి లేదా బిడ్డ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సాధారణ ప్రసవం సాధ్యం కాని పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల  వైద్యులు సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు.  నిజానికి నేటి కాలంలో సి-సెక్షన్ ఏ ఎక్కువగా సాగుతోంది. అయితే నేటి కాలం మహిళలలో మెల్లిగా మార్పు వస్తోంది.  చాలామంది సి-సెక్షన్ బదులు సాధారణ ప్రసవం కావాలని వైద్యులను సంప్రదిస్తున్నారు.  ఇందుకోసం ప్రెగ్నెన్సీ క్లియర్ అయ్యింది మొదలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే చాలామంది మహిళలు చేసే ఒక తప్పు వల్ల సాధారణ డెలివరీ కావాలని అనుకున్న వారు కూడా సి-సెక్షన్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మహిళలు చేస్తున్న తప్పేంటి? తెలుసుకుంటే.. నీరు.. గర్భాధారణ సమయంలో మహిళలు  నీరు పుష్కలంగా తాగకపోవడం సాధారణ డెలివరీ అవకాశాలను తగ్గిస్తుందట.  భారతదేశం వంటి వేడి చాలా ఎక్కువగా ఉండే దేశంలో గర్భిణీ స్త్రీలు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు లేదా ద్రవాలు తీసుకోవాలని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు లేదా నీటి వనరులు అంటే నీరు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని కోసం జ్యూసులు  కూడా తాగవచ్చు. అలాగే  కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కానీ  రోజంతా 3 నుండి 4 లీటర్లు నీరు తాగాలి. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు, అది గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దాని స్థాయి పడిపోతే శిశువు ఎప్పుడైనా గర్భంలో మల విసర్జన చేయవచ్చు.  ఇది ప్రసవాన్ని  అత్యవసరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సాధారణ ప్రసవానికి బదులుగా సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త వహించాలి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
ప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళలు చేసే ఈ తప్పు.. సి-సెక్షన్ కు పెద్ద కారణం..! Publish Date: Jul 19, 2025 9:30AM

భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం..నీట మునిగిన పలు ప్రాంతాలు

    హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి చిగురుటాకులా భాగ్యనగరం వణుకిపోతుంది. పలు ప్రాంతాల్లో  ఇళ్లు, షాపుల్లో వరద నీరు చేరింది. రోడ్లు ఫ్లైఓవర్లు వరద నీటితో పొంగిపొర్లుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహంతో కోట్టుకుపోయాయి. కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ - హబ్సిగూడ, మియాపూర్ - గచ్చిబౌలి మార్గాల్లో, వివిధ కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. తమను రక్షించాలని పోలీసులు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా వారిని వెనుక వైపు నుంచి రక్షించారు. చిన్న పడవలలో వారిని బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షంతో కురవడంతో రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. నగరంలో అత్యధికంగా మారేడ్‌పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలనగర్, బండ్లగూడ, మూషీరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.   తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. భారీ వర్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జీహెచ్ఎంసీ   హైడ్రా అధికారులు వరదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం..నీట మునిగిన పలు ప్రాంతాలు Publish Date: Jul 18, 2025 9:31PM